రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరానికి హుస్నాబాద్‌లో శంఖారావం పూరించిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. ప్రచారపర్వాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు.
జనగామ, భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. జనగామలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించనున్నారు.
జనగామలోని మెడికల్ కాలేజీ మైదానంలో ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, రెండు పట్టణాల నుంచి లక్షకుపైగా జనం తరలివచ్చేలా ఏర్పాట్లు పూర్తిచేశారు.
సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా జనగామలోని సభా ప్రాంగణం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకొంటారు.
అనంతరం సభలో ప్రసంగిస్తారు. జనగామ సభ ముగిసిన వెంటనే సీఎం కేసీఆర్ భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు.
ఇందుకోసం బీఆర్‌ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. వేదికను, సభా ప్రాంగణంతోపాటు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా రెయిన్ ప్రూఫ్ స్టేజీ వేశారు. బహిరంగ సభ నేపథ్యంలో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. జనం ఇబ్బందులు పడకుండా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు.
బహిరంగ సభకు 60 వేల మందికి పైగా జనం రానున్నట్టు బీఆర్‌ఎస్ శ్రేణులు తెలిపారు.రెండో చోట్ల పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు..