ఒకేరోజు 35 లక్షల కుటుంబాలను కలవనున్న బీజేపీ
-‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో 22న ప్రజల వద్దకు వెళ్లనున్న కమలనాథులు
-పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు… రాష్ట్ర అధ్యక్షుడి వరకు
-ఒక్కో బూత్ అధ్యక్షులు కనీసం వంద మంది కుటుంబాలను కలిసేలా కార్యాచరణ
-రాష్ట్రస్థాయి నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు
నరేంద్రమోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈనెల 22న ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ ఈరోజు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ‘‘ఇంటింటికీ బీజేపీ’’ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.
• రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయి. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈనెల 22న వంద కుటుంబాలను కలిసి నరేంద్రమోదీ పాలనలో జరిగిన అభివ్రుద్ధిని వివరించడంతోపాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. దీంతోపాటు స్టిక్కర్లను అంటించనున్నారు.
• బండి సంజయ్ సైతం ఆరోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్యపురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటిస్తారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించడమే కాకుండా కరపత్రాలను సైతం అందజేయనున్నారు.
• అట్లాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిసహా రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, జాతీయ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా ఆరోజు తమ తమ నియోజకవర్గాల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పర్యటించి ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలవనున్నారు.
• మహా జనసంపర్క్ యాత్రలో భాగంగా ఈనెల 22 నుండి 30 వరకు ఇంటింటికీ బీజేపీ పేరుతో బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్రమోదీ పాలనను వివరించడంతోపాటు ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు