SAKSHITHA NEWS

Journalists should support their families

జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలి

కేంద్ర మంత్రికి ఎంపీ నామ లేఖ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కోవిడ్ తో మృతి చెందిన ఖమ్మం నగరానికి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సత్వరమే జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ ( జెడబ్ల్యుఎస్) కింద ఆర్ధిక సాయం మంజూరు చేసి, వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కు లేఖ రాశారు. ఖమ్మం నగరంలోని ఎన్ఎస్టీ రోడ్ లో నివాసం ఉంటున్న కాశం వెంకన్న ఆంధ్రజ్యోతి తదితర దిన పత్రికల్లో జర్నలిస్ట్ గా పని చేశారు. అయితే ఆయన 2021, మే 25న కోవిడ్ తో మృతి చెందారు.

తన భర్త కోవిడ్ తో మృతి చెందడం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, జర్నలిస్ట్ సంక్షేమ పథకం కింద ఆర్ధిక సాయం చేసి, ఆదుకోవాలని వెంకన్న భార్య సుశీల దరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం కు చెందిన మరో సీనియర్ జర్నలిస్ట్ బైరు కరంచంద్ గాంధీ కూడా 2022 జూలై 9న మృతి చెందారు.

ఆయన భార్య వెంటనర్సమ్మ కూడా తనకు ఆర్ధిక సాయం అందజేసి, ఆదుకోవాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇరు కుటుంబాల వారు నామను కలిసి, తమ పరిస్థితిని వివరించగా, నామ వెంటనే స్పందించి, సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాశారు. సంబంధిత జర్నలిస్టుల దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందజేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎంపీ నామ కేంద్ర మంత్రిని కోరారు.


SAKSHITHA NEWS