SAKSHITHA NEWS

తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…!

  • రోజులు గడుస్తున్నా రైతులకు అందని నష్టపరిహారం
  • కల్లాల్లో ఉన్న ప్రతిగింజను కొనాల్సిందే
  • పంటనష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20వేలు చెల్లించాలి
  • మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి డిమాండ్
  • వేంసూరు మండలంలో వరిధాన్యం పరిశీలన

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో 45రోజుల క్రితం పర్యటించినప్పుడు పంట నష్టపోయిన మొక్కజొన్న రైతులకు తక్షణమే ఎకరాకు రూ.లక్ష చొప్పున ఇస్తానన్నారు…. కానీ నేటికీ ఆ పరిహారం అందిన పాపాన పోలేదు. అస్సలు తక్షణం అంటే ఎన్ని నెలలు ముఖ్యమంత్రి గారు…! ఆరునెలలా… తొమ్మిది నెలలా… సంవత్సరమా…! మీరే చెప్పండి అంటూ ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు. వేంసూరు మండల పర్యటనలో భాగంగా భీమవరం, వెంకటాపురం, కల్లూరుగూడెం, చిన్నమల్లెల, కె.జి. మల్లెల గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న వరిధాన్యాన్ని పరిశీలించి మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి, ఇతర కూరగాయల పంటలు ఆగమయ్యాయని విచారం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతులకు న్యాయం జరిగేదని కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అది కానరావడం లేదని విమర్శించారు.

రైతు బంధు పేరుతో అరకొర డబ్బులు ఇస్తూ రైతన్నలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రైతుల గోస, బాధ, ఆవేదన కేసీఆర్ కు అస్సలు పట్టడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను తన ఇంట్లో సొమ్ము గానీ, బ్యాంకు అకౌంట్లో ఉన్న సొమ్ము గానీ రైతులకు ఇవ్వమని అడగటం లేదని ప్రజల సొమ్మునే వారికి నష్టపరిహారంగా ఇవ్వమని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే కల్లాల్లో ఉన్న ప్రతి వరి ధాన్యపు గింజను, మొక్కజొన్నను కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన వరి, మొక్కజొన్న, మామిడి, ఇతర కూరగాయల రైతులకు ఎకరాకు రూ. 20వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. యుద్ధప్రతిపాదికన ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, నారపోగు వెంకట్, అట్లూరి సత్యనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS