రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారంతో ఆనందోత్సాహాలు, డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు ఘన సత్కారం

Spread the love

సాక్షిత సికింద్రాబాద్, ఆగష్టు 8 : రేషన్ డీలర్లు చిరకాలంగా ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ల సమాఖ్య గౌరవాధ్యక్షుడి హోదాలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సచివాలయంలో మంత్రుల బృందంతో చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం సితాఫలమండీ లోని డిప్యూటీ స్పీకర్ క్యాంపు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో డీలర్లు సమాఖ్య జే ఏ సీ రాష్ట్ర కన్వీనర్, అఖిల తెలంగాణా రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షుడు దొమ్మాట రవీందర్, సొసైటీ అధ్యక్షుడు, జే ఏ సీ రాష్ట్ర కో కన్వీనర్ గడ్డం మల్లికార్జున్ గౌడ్ తదితరుల అధ్వర్యంలో చేరుకొని పద్మారావు గౌడ్ ను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సమాఖ్య నేతలు రవీందర్, మల్లేష్ తదితరులు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు చెల్లించే కమిషన్ ను క్వింటాల్ కు 70 రూపాయల నుంచి 140 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక మని అన్నారు. అదే విధంగా డీలర్లకు ఆరోగ్య భీమా సదుపాయం, ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి ఆమోదం, అంత్యక్రియల ఖర్చుల చెల్లింపు వంటి వివిధ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలత తెలిపిందని పేర్కొన్నారు.

ఆర్ధిక మంత్రి హరీష్ రావు, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఎం ఎల్ ఏ పద్మ దేవేందర్ రెడ్డిల సమక్షంలో డీలర్ల సమాఖ్య జరిపిన చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు అండగా నిలిచేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, మున్ముందు రోజుల్లో కూడా తాము ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని వారు ప్రకటించారు. చర్చలు ఫలప్రదం కావడంలో కృషి చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు వారు కృతఙ్ఞతలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page