SAKSHITHA NEWS

రైతులకు రెట్టింపు ఆదాయమే లక్ష్యం
–నాణ్యతకు పెద్దపీట వేసిన జగన్‌ ప్రభుత్వం
–నియోజకవర్గ స్థాయిలో అగ్రీల్యాబ్స్‌లు తెచ్చిన ఏకైక రాష్ట్రం
–ఆర్బీకేల ద్వారా రైతు ముంగిట నాణ్యమైన ఉత్పాదకాలు
–ధరల స్థిరీకరణ నిధి ద్వారా పంటలకు కనీస మద్దతు ధర
–పంటలకు ఇండి గ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తోన్న తొలి రాష్ట్రం
–సర్టిఫికేషన్‌తో రైతులకు ఎమ్మెస్పీ కంటే రెట్టింపు ఆదాయం
–క్యూసీఐతో అవగాహనా ఒప్పందంతో రైతులకు మరింత లబ్ది
–ఏపీ గున్వత్‌ సంకల్ప్‌ వర్కుషాపులో వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

విజయవాడ: రైతులు తాము పండించిన పంటలకు మద్దతు ధర కంటే రెట్టింపు ఆదాయం సమకూర్చడమే లక్ష్యంగా ఎన్నో సంస్కరణలు, మరెన్నో విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు ఉన్న సంక్షేమ ఫలాలు అందించడమే తప్ప ఇలా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. విజయవాడలో మంగళవారం జరిగిన ఏపీ గన్వత్‌ సంకల్ప వర్కుషాపులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలనలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు.

పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్న ఆయన ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలవాలన్న సంకల్పంతో రైతులకు ఓ వైపు సంక్షేమ ఫలాలు అందిస్తూనే, మరోవైపు వారి అభ్యున్నతి కోసం బలమైన పునాదులు వేసిందన్నారు. గ్రామస్థాయిలో ప్రతీ రైతును చేయిపట్టి నడిపించేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా యంత్ర సేవా కేంద్రాలు, గోదాములతో కూడిన మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసిందన్నారు. విత్తు నుంచి విక్రయం వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ధాన్యంతో సహా ఇతర పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తూ ప్రతీ రైతుకు మద్దతు ధర దక్కేలా చేస్తోందన్నారు.
అలాగే నాణ్యమైన ఉత్పాదకాలను అందించడమే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. రైతుల కోసం ఇలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని గత పాలకులు ఆలోచన కూడా చేయలేదన్నారు.


వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందించడంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఉచిత విద్యుత్, యూనివర్సల్‌ కవరేజ్‌ కింద నోటిఫైడ్‌ పంటలకు ఉచిత పంటల బీమా, వడ్డీ లేని రుణాలు, కనీస మద్దతు ధరకు రైతు క్షేత్రం వద్ద పంటల ఉత్పత్తుల కొనుగోలు, 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్, వ్యవసాయ యాంత్రీకరణ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆర్బీకేల ఏర్పాటు ఓ విప్లవాత్మక మార్పు అని కొనియాడారు.


నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు పంపిణీతో పాటు సాగులో రైతులకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం, పొలంబడుల ద్వారా నాణ్యమైన దిగుబడుల సాధనకు శిక్షణ ఇవ్వడం, ఈ క్రాప్‌ బుకింగ్, పాడి, ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్‌ అందించడంతో పాటు బ్యాంకింగ్‌ సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు.
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు, అవార్డులు, రివార్డులతో నేడు మన ఆర్బీకేలు దేశానికే కాదు.. ప్రపంచానికే ఓ రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు.
ఉద్యాన పంటల హబ్‌గా ఏపీ కొత్త రికార్డులను నెలకొల్పుతోందన్నారు. బొప్పాయి, టమాటా, కొకో, పామాయిల్‌లో మొదటి స్థానంలో నిలవగా, అరటి, బత్తాయి, వంగ, మిరపలో రెండో స్థానంలో, మామిడి, ఉల్లి, జీడిమామిడిలో మూడో స్థానంలో ఏపీ నిలిచిందన్నారు.
రొయ్యలు, చేపలు, గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే నెం.1 స్థానంలో నిలిచిందన్నారు. ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీలో భాగంగా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటుచేస్తోందన్నారు. రూ.17వేల కోట్ల అగ్రి ఇన్‌ఫ్రాఫండ్స్‌ సాయంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను బలోపేతం చేస్తున్నామన్నారు.


ఇప్పటికే ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటు కోసం 48వేల ఎకరాలను అందుబాటులో ఉంచామన్నారు. తాజాగా క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సహకారంతో వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు ఇండిగ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తున్నామన్నారు.
ఫలితంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సర్టిఫికేషన్‌ జారీ చేద్వారా 130 దేశాల్లో రైతులు పండించిన పంటలను అమ్ముకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ఖరీఫ్‌–23లో పైలెట్‌ ప్రాజెక్టు కింద 600 హెక్టార్లలో 33 ఎఫ్‌పీవోలు పండించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గ్యాప్‌ సర్టిఫికేషన్‌ జారీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు అర్హత పొందిన 14 ఎఫ్‌పీవోలకు గ్యాప్‌ సర్టిఫికేషన్‌లు నా చేతుల మీదుగా జారీ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఈ వర్కుషాపులో క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్శన్‌ జాక్సా షా , సీఈఇ డాక్టర్‌ ఏ రాజ్ , వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది , వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ చిరంజీవిచౌదరి , వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్ , ఉద్యాన శాఖ కమిషనర్‌ శ్రీధర్ , సహకార శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు , పశుసంవర్ధక శాఖడైరెక్టర్‌ అమరేంద్రకుమార్ , మత్స్యశాఖ కమిషనర్‌ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 19 at 6.08.34 PM

SAKSHITHA NEWS