Fluoride victim Ata Swami Kannumuta..
ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత..
నల్గొండ:అంశాల స్వామి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే.. ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన వారిలో అంశాల స్వామి ఒకరు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫ్లోరోసిస్ బాధితుల గళాన్ని వినిపించిన వ్యక్తి అతను. చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారిన పడిన అంశాల స్వామి.. గత 32 ఏండ్ల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ బాధితుల తరపున తన గళాన్ని గట్టిగా వినిపించిన అంశాల స్వామి.. అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. స్వామి మృతిపట్ల పలువురు నాయకులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
అంశాల స్వామి సొంతూరు మునుగోడు నియోజక వర్గంలోని శివన్నగూడెం. ఫ్లోరైడ్ రక్కసి పోరాటంలో భాగంగా జలసాధన సమితిని స్థాపించిన దుశ్చర్ల సత్యనారాయణ.. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్వామిని ఢిల్లీకి తీసుకెళ్లి, తమ గోడును వినిపించారు. స్వామిని వాజపేయి టేబుల్‌పై పడుకోబెట్టి, ఫ్లోరోసిస్ సమస్యను వివరించారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలోనే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న ఆ నియోజకవర్గ ప్రజలకు సురక్షిత మంచినీరు అందించారు కేసీఆర్.
అంతే కాదు అంశాల స్వామి పోరాటాన్ని గుర్తించిన కేటీఆర్.. గతేడాది ఆయన సొంతింటి కలను నెరవేర్చారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్.. వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. స్వామి కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటానని భరోసా కల్పించారు మంత్రి కేటీఆర్.