SAKSHITHA NEWS

హైదరాబాద్ :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ విగ్రహం
దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఎత్తయినదిగా ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని ఈ నెల 14న అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

హుస్సేన్‌సాగర్‌ తీరంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యేలా రవాణా సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది. అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.


SAKSHITHA NEWS