SAKSHITHA NEWS

doctor should be like this… leave the car on the road and run for the patient… the patient is safe

డాక్టరంటే ఇలా ఉండాలి… రోడ్డుపై కారు వదిలేసి పేషంట్‌ కోసం పరుగులు.. రోగి సేఫ్

డాక్టర్లు… దేవుళ్లతో సమానం అంటుంటారు. చావు బతుకుల్లో ఉండే మనుషులను రక్షించే సామర్థ్యం వారి చేతుల్లో మాత్రమే ఉంటుంది. అందుకే సమాజంలో వైద్యులకు అంత ప్రాముఖ్యత, గౌరవం ఉంటాయి. తాజాగా తన వృత్తి పట్ల ఉన్న కమిట్‌మెంట్‌తో ఓ డాక్టర్ చేసిన పని గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మరీ ఆ డాక్టర్ పేషంట్‌ కోసం అంత గొప్ప పని చేశారు. కొద్ది సేపట్లో ఓ వ్యక్తికి ఆపరేషన్ చేయాల్సిన డాక్టర్.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. సాధారణంగా ఇంకేవరైనా ఆపరేషన్‌ను పోస్ట్‌పోన్ చేస్తారు. ఆలస్యమైనా ఫర్వాలేదులే చేద్దాం అనుకుంటారు. కానీ బెంగళూరులో ఓ డాక్టర్ అలా అని ఊరుకోలేదు. తన వల్ల పేషంట్ ఆపరేషన్కు ఆలస్యం అవుతుందని భావించి మూడు కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి కు వెళ్లిన వెంటనే రోగికి శస్త్ర చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. ఇది తెలుసుకున్న జనం ఆ డాక్టర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

బెంగళూరు సిటీలో మణిపాల్ ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్ట్ 30వ తేదీన ఆస్పత్రికి బయల్దేరారు. కానీ ఉదయం 10 గంటలకు ఒక మహిళకు గాల్‌బ్లాడర్ ఆపరేషన్ చేయాలి. అయితే ఆస్పత్రికి వెళ్లేదారిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దాంతో డాక్టర్ టెన్షన్ పడ్డారు. సమయానికి మహిళ ఆపరేషన్ చేయాలనేదే ఆయన మెదడులో ఉంది. ఇక ట్రాఫిక్‌ ఎంతకీ క్లియర్ కాకపోవడంతో.. కారు నుంచి దిగి మూడు కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రికి చేరుకున్న వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మహిళకు ఆపరేషన్ చేసి.. ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. ఆపరేషన్ కూడా సక్సెస్ కావడంతో ఆ మహిళను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేశారు. అయితే దీనిపై ఆ డాక్టర్‌ను ప్రశ్నించగా.. తను రోగి గురించి మాత్రమే ఆలోచించి.. పరుగు తీశానన్నారు. రెగ్యులర్‌గా జాగింగ్ చేయడం వల్ల.. తనకు పరుగు తీయడం అలవాటై పోయిందన్నారు. డాక్టర్ గోవింద్ నంద‌కుమార్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి డాక్టర్ల వల్లే వైద్య వృత్తిపై గౌరవం పెరుగుతుందన్నారు.


SAKSHITHA NEWS