Dalit Bandhu units should be used to grow economically
దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి.
–అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి
దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ దళితబంధు పథక లబ్దితో చేపట్టుచున్న యూనిట్ల నిర్వహణను ఖమ్మం పట్టణం, చింతకాని మండలం అనంతసాగర్ లలో పర్యటించి, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక నయాబజార్ సర్కిల్ వద్ద మొబైల్ టిఫిన్ సెంటర్, ఎఫ్సిఐ గోడౌన్ వద్ద డీజిల్ సర్వీస్, బస్ డిపో రోడ్ లో కిరాణా షాపు, స్తంభాని నగర్ వద్ద సూపర్ మార్కెట్, శ్రీ శ్రీ సర్కిల్ వద్ద సానిటరీ ప్యాడ్ తయారీ యూనిట్, ముస్తఫా నగర్ వద్ద రెడీమేడ్ బట్టల షాప్, శ్రీరాం హిల్స్ వద్ద డాబా హోటల్, ముస్తఫా నగర్ వద్ద టైలరింగ్ షాప్, బోనకల్ క్రాస్ రోడ్ వద్ద కిరాణా షాప్, చింతకాని అనంతసాగర్ గ్రామంలో డెయిరీ, కిరాణా షాపు యూనిట్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, దళితబంధు పథకంతో నెలకొల్పిన యూనిట్లను లాభదాయకంగా నిర్వహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లబ్ధిదారులకు సూచించారు. లబ్ధిదారులతో యూనిట్ల అభివృద్ధి గురించి, లాభాల గురించి అడిగి తెలుసుకున్నారు. యూనిట్ల మంజూరుకు ముందు ఏం చేసేవారు, అప్పుడు ఆర్థిక స్థితి ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అడిగి తెలుసుకున్నారు. యూనిట్ల నిర్వహణ స్వయంగా చేసుకోవాలని, అప్పుడే లాభదాయకంగా ఉంటుందని అన్నారు. దళిత బంధు యూనిట్లను మరింత అభివృద్ధి చేసుకోవడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు.
ఈ యూనిట్ల పరిశీలన కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఇడి ఇ. శ్రీనివాసరావు, చింతకాని మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.