ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాగా, మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా కూడా సహాయక చర్యలను చేపట్టనున్నారు.