ప్రకాశం : చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు..
ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారాయన.
”మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నాం. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశాం. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నాం. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని అన్నారాయన.
పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారు. అలాగే ఇంటింటికీ తలుపు తట్టి సేవలు అందిస్తున్నామని.. 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారాయన..