పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు, శాంతిభద్రతలపై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముందుగా పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సి ఐ ఎస్ ఎఫ్ సౌత్ జోన్ -ll డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ జనరల్ యం. నందన్ ని ఆహ్వానం పలుకుతూ… పుష్పగుచ్చాన్ని పోలీస్ కమిషనర్ అందజేశారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహం పై సెంట్రల్ ఫోర్స్ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బేటి అయినట్లు పెర్కొన్నారు. ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు.
ఎన్నికల సమయంలో మద్యం, నగదు, మాధకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ చర్యలు, సరిహద్దు మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో పకడ్భందీగా తనిఖీలు, ఇరు రాష్ట్రల సరిహద్దు పోలీసులు పరస్పరం సమాచార వ్యవస్థను సమన్వయం చేసుకొంటూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తూ ప్రశాంత వాతావరణ కల్పిస్తూ.. ఎన్నికల బందోబస్తు విజయవంతం చేస్తామని అన్నారు. ఇప్పటికే మూడు కంపెనీల కేంద్ర బలగాలు జిల్లాకు చేరకున్నాయని, రానున్న రోజుల్లో బలగాల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపారు.
గత ఎన్నికల సమయంలో కేసులు నమోదైన వారు ప్రస్తుతం ఎక్కడున్నారు, వారి కదలికలపై దృష్టి సారించాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. తీరు మారకుండా వ్యవహరించే వారిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కమాండెంట్ మనోజ్ కుమార్ మౌర్య, డిప్యూటీ కమాండెంట్ మాల్కిత్ సింగ్ పాల్గొన్నారు.