SAKSHITHA NEWS

మాటల కన్నా చేతల ద్వారా మార్పును చూపించాలి

  • జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్.

జోగులాంబ గద్వాల జిల్లా( చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు, చేనేత వస్త్రాలు ధరించి, మాటల కన్నా చేతల ద్వారా మార్పును చూపించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. గురువారం ఐ.డి.ఓ.సి సమావేశం హాల్ నందు ప్రజా పాలన-ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో చేనేత సంబరాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా డిసెంబరు 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం రెండవ స్థానం ఆక్రమించిందని, గద్వాల చేనేత చీరలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందాయని, భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) సాధించాయని తెలిపారు. చేనేత రంగ కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఇందులో థ్రిఫ్ట్ ఫండ్, పాలవడ్డీ పథకాల కింద రుణాలు అందించడం జరుగు తుందన్నారు. జిల్లాలో చనిపోయిన 10 మంది నేత కార్మికుల కుటుంబాలకు చేయూత అందించేందుకు చేనేత భీమ పథకం క్రింద రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు. మీరు చూడాలని కోరుకునే మార్పుకు మీరు స్వయంగా మారాలి అనే గాంధీజీ వాక్యాన్ని ఉదహరిస్తూ, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి మాటలకంటే చేతల ద్వారా మార్పును చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. చేనేత రంగం భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించిందని, ఖాదీ ఉద్యమాన్ని ప్రస్తావించారు. వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి మార్గమని అన్నారు. ఈరోజుల్లో పాశ్చాత్య పోకడలు పెరుగుతున్న నేపథ్యంలో, భారతీయ సంప్రదాయమైన చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ఎంతో అవసరమని తెలిపారు. చేనేత వృత్తిలోని నైపుణ్యాన్ని యువత తెలుసుకొని నేర్చుకోవాలని, ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించి, అవగాహన పెంచితే చేనేత రంగాన్ని కాపాడిన వారమవుతామని పేర్కొన్నారు.
అంతకుముందు కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన గద్వాల చీరల స్టాళ్లను ప్రారంభించి, వాటి ప్రత్యేక డిజైన్లను చూసి స్థానిక చేనేత ఉత్పత్తుల్ని అభినందించారు.
అనంతరం చేనేత వృత్తిలో నైపుణ్యం పొందిన చేనేత కార్మికులను, ఫ్యాషన్ షోలో పాల్గొన్న విద్యార్థినిలను, వివిధ పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా మేమెంటోలు, సర్టిఫికెట్లతో ఘనంగా సన్మానించారు. చేనేత కార్మికులకు 6.05 లక్షల రూపాయల పావలవడ్డీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీ నారాయణ, నర్సింగ రావు, చేనేత మరియు జౌలి శాఖ సహాయ సంచాలకులు గోవిందయ్య, ఉప సంచాలకులు నాగలత, సహాయ సంచాలకులు భిక్షపతి, జెడ్పీ సిఈఓ కాంతమ్మ, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS