Chairman, Telangana State Dairy Development Co-operative Federation Limited
తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్’’చైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.
సిఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమా భరత్ కుమార్ ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగనున్నారు.
తన నియామక ఉత్తర్వును సిఎం కెసిఆర్ చేతులమీదుగా ప్రగతి భవన్ లో కలిసి అందుకున్న భరత్ కుమార్, తనకు అవకాశమిచ్చినందుకు సిఎం కేసీఆర్ కి కృతజ్జతలు తెలిపారు. కాగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన సిఎం ., అభినందించి ఆశీర్వదించారు.
ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోమా భరత్ కుమార్ (62)., టిఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం నుంచి సిఎం కేసీఆర్ వెంట వున్నారు. సూర్యాపేట జిల్లా, తుంగతూర్తి నియోజకవర్గం, వర్థమానుకోట గ్రామ వాస్తవ్యుడు, వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమా భరత్ కుమార్ వృత్తి రీత్యా ప్రముఖ సీనియర్ అడ్వకేట్ గా సేవలందిస్తూ పేరుగాంచారు.
తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజాస్వామిక స్పూర్తితో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం పంచుకున్నారు. నాటి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నేటి దాకా టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అప్పగించిన బాధ్యతలను కర్తవ్యధీక్షతో నిర్వర్తిస్తూ, పార్టీ వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తున్నారు.
అటు అధినేత విశ్వాసాన్ని ఇటు పార్టీ నేతల అభిమానాన్ని చూరగొంటూ పార్టీకోసం పనిచేస్తున్న సోమా భరత్ కు పార్టీ లో ఓపికస్తుడుగా, సౌమ్యుడిగా పేరుంది. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధినేత సిఎం కెసిఆర్ డైరీ డెవలప్ మెంట్ చైర్మన్ గా నియమించడం పట్ల నాటి ఉద్యమకారుల్లో తెలంగాణ వాదుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.