Central Govt on handloom
సాక్షిత : చేనేత పై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం GST ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
మంత్రిని వెస్ట్ మారెడ్ పల్లి లోని తన నివాసంలో పలువురు చేనేత సంఘం ప్రతినిధులు కలిసి GST విధించడం వలన కలిగే ఇబ్బందులను మంత్రికి విన్నవించారు. చేనేత వస్త్రాలు, ముడి సరుకుల పై GST ఎత్తి వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కి మంత్రి పోస్ట్ కార్డును పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వ్యాపారం కాదు…. వృత్తి అని అన్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదని చెప్పారు.
చేనేతవృత్తి దారులలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారని వివరించారు.
సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్వ వైభవం తీసుకొచ్చినట్లు తెలిపారు.
చేనేతలను ఆదుకొనేలా సబ్సిడీపై ముడి సరుకులు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బతుకమ్మ చీరలను చేనేత ల ద్వారా తయారు చేయించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని అన్నారు. చేనేత కళాకారుడి నైపుణ్యం, సృజనాత్మకత పై ఆధారపడి ఈ రంగం మనుగడ సాగిస్తోందని తెలిపారు.
ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చేనేత రంగంపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం GST విధించడం తగదని అన్నారు. చేనేత రంగంపై ఆధారపడి న లక్షలాది మంది కార్మికులకు తీరని అన్యాయం చేసే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోకుంటే నేతన్నల ఆగ్రహానికి గురి కాక తప్పదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కూడా ఉన్నారు. మంత్రిని కలిసిన వారిలో పద్మశాలి మేళా కమిటీ అధ్యక్షులు SS జయరాజ్, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు సుదేశ్, జానయ్య, సభ్యులు రోషన్ బాలు, రాజు, బింగి నవీన్ తదితరులు ఉన్నారు.