లోక్‌సభ ఎన్నికలు 2024: తొలి జాబితా విడుదల చేయనున్న బీఆర్ఎస్

Spread the love

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విడుదల చేయనుంది.వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

దరిమిలా లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించనుంది. ఇప్పటికే పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆ పార్టీ నాయకత్వం సమీక్షలు నిర్వహించింది.ఈ సమీక్షల్లో పార్టీ శ్రేణులు వెలుబుచ్చిన అభిప్రాయాలతో పాటు సర్వే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులను గులాబీ బాస్ ఎంపిక చేయనున్నారు.

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్: కరీంనగర్‌ నుండి ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ శ్రీకారం

2019 ఎన్నికల్లో తెలంగాణ నుండి 9 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ముగ్గురు ఎంపీలు ఇప్పటికే పార్టీ మారారు. ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరారు. ఒక్క ఎంపీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ కు ఈ పరిణామం రాజకీయంగా ఇబ్బందేననే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై ఆ పార్టీ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది.

ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీల్లో కొందరు పోటీ చేస్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గెలిచే అభ్యర్థులకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది.కరీంనగర్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్, చేవేళ్ల నుండి రంజిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది. అయితే తాజాగా చేవేళ్ల స్థానంలో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే ఈ విషయమై త్వరలోనే స్పష్టత రానుంది.

పెద్దపల్లి నుండి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపుతారనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. నల్గొండ నుండి గుత్తా అమిత్ రెడ్డి లేదా తేరా చిన్నపరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.భువనగరి పార్లమెంట్ స్థానం నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు వినిపిస్తుంది.సికింద్రాబాద్ నుండి తలసాని సాయి కిరణ్ ను బీఆర్ఎస్ నాయకత్వం బరిలోకి దింపే అవకాశం ఉంది.

ఎలాంటి వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించే అవకాశం లేకపోలేదు. రెండు రోజుల క్రితం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. తెలంగాణలోని 9 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 12 నుండి 14 మంది అభ్యర్థుల జాబితాను ఖరారు చేసిందని సమాచారం. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను విడుదల చేయనుంది.

Related Posts

You cannot copy content of this page