SAKSHITHA NEWS

ఏపీ మంత్రి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు..

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో నిషేధిత విప్లవ సంస్థ నుంచి ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు హెచ్చరికలు జారీ అయ్యాయి.పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ మంత్రికి మావోయిస్టుల నుంచి వార్నింగ లేఖ వచ్చింది. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను మావోయిస్టులు హెచ్చరించారు. ఈ మేరకు మావోయిస్టుల నుంచి మంత్రికి హెచ్చరికలు జారీ అయ్యాయన్న వార్తలు ఉత్తరాంధ్రలో కలకలం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే…

మావోయిస్టుల లేఖలోని అంశాలతో తనకేమీ సంబంధం లేదని అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విపక్షంపై తనదైన శైలిలో విరుచుకుపడిన అప్పలరాజు సీఎం జగన్ దృష్టిలో పడ్డారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన అప్పలరాజును ఆ వెంటనే మంత్రివర్గంలోకి తీసుకున్న జగన్‌… తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కూడా కొనసాగించారు. ఇటీవల అప్పలరాజు వ్యవహారంపై విపక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు ఎదురు కావడం గమనార్హం.


SAKSHITHA NEWS