తిరుమల తిరుపతి శ్రీవారి సొమ్ము డిపాజిట్లపై మరో వివాదం.. తిరుపతి టౌన్ బ్యాంక్‌లో టీటీడీ రూ.10 కోట్ల డిపాజిట్ పై దుమారం
టీటీడీ ట్రస్టు… అనుమతితో అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న టీటీడీ ఇప్పటివరకు ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, విజయ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టు స్పష్టం అవుతోంది.
ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి టౌన్ బ్యాంకులో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.
తిరుమల తిరుపతి క్షేత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య సగటున రోజుకు 65 వేల నుంచి 70వేల మందికి పైగానే ఉంటుంది. రోజువారీ హుండీ ఆదాయం సగటున మూడున్నర కోట్ల నుండి రూ. 4 కోట్లు వరకు ఉంటుంది. స్వామివారిని ఏడాదికి దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 2.56 కోట్ల మందికి పైగా ఉంటుండగా టీటీడీ ఈమధ్య విడుదల చేసిన శ్వేత పత్రంలో రూ.15938 కోట్ల నగదు డిపాజిట్లు. 10258 కిలో బంగారు డిపాజిట్లు తిరుమల వెంకన్న ఆస్తుల లెక్క చెప్పింది. ప్రతినెల శ్రీవారి హుండీ ఆదాయం కూడా రూ.100 కోట్లకు పైగానే ఉంటుండగా శ్రీవారి సొమ్ము డిపాజిట్ ల వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది.
తిరుపతి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకులో రూ.10 కోట్లను గుట్టుచప్పుడు కాకుండా టీటీడీ డిపాజిట్ చేసిందన్న విషయం దుమారం రేపింది. తిరుపతి టౌన్ బ్యాంకులో వెంకన్న ఖజానా నుంచి రూ.10 కోట్లు నిధులను డిపాజిట్ చేసింది. దీనికి సంబంధించిన డిపాజిట్ బాండ్లను కూడా టీటీడీకి టౌన్ బ్యాంక్ అందజేసింది.
టీటీడీ నిబంధనల మేరకు వడ్డీ కాసుల వాడి సొమ్ము అధిక వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలన్న నిబంధన టీటీడీలో ఉంది. మరోవైపు ప్రభుత్వం ఆమోదించిన ప్రైవేట్ రంగ బ్యాంక్ లు కొటేషన్లు సమర్పించే అర్హత పొందడానికి అత్యధిక క్రెడిట్ రేటింగ్ కలిగి వుండాలన్న షరతు కూడా ఉంది.
వెంకన్న సొమ్ము డిపాజిబ్ చేసేందుకు టీటీడీ జాతీయ బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తుందో తెలియజేస్తూ సీల్డు కవర్స్ లో కొటేషన్ లను పొందాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రూ.10 కోట్లను తిరుపతి టౌన్ బ్యాంకులో 8.5 శాతం వడ్డీ రేటుతో డిపాజిట్ చేయడంతో టీటీడీ బ్యాంకుల్లో శ్రీవారి నిధులు డిపాజిట్ చేయడం చర్చకు దారితీసింది.
టీటీడీ శ్రీవారి నిధులను సహకార బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు యత్నించడంపై గతంలోనూ భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఇప్పుడు సప్తగిరి గ్రామీణ బ్యాంకు, తిరుపతి సహకార టౌన్ బ్యాంకుల్లో టీటీడీ రూ.50 కోట్ల వరకు డిపాజిట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.10 కోట్లను గత వారం తిరుపతి టౌన్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి బాండ్లను పొందడంపై విమర్శలను టీటీడీ ఎదుర్కోవాల్సి వచ్చింది
తిరుపతి టౌన్ బ్యాంక్ కు వంద ఏళ్ల చరిత్ర ఉందంటోంది. ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న తిరుపతి టౌన్ బ్యాంకులో డిపాజిట్లను చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
టీటీడీ డిపాజిట్ చేసిన స్థానిక బ్యాంకులు దివాళా తీస్తే టీటీడీ కి వచ్చే ఆపార నష్టం పైనా దృష్టి సారించాల్సి అవసరం ఉందన్న అభిప్రాయం భక్తుల్లో ఉంది. ఆర్ధికంగా పరిపుష్టి కలిగి ఉండే జాతీయ బ్యాంకులు, ఏ ఇతర కారణాలతో నష్టాలతో సమస్యలు ఉత్పన్నం కాకుండా నగదు రక్షణకు తీసుకుంటున్న చర్యల పట్ల టీటీడీ ముందస్తు సమాచారం భక్తులకు ఇవ్వాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది