SAKSHITHA NEWS

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి బహిరంగ లేఖ

జిల్లా అభివృద్ధికి వార్షిక బడ్జెట్,లో అరకొర నిధులతో మొండి చెయ్యి… వెలిగొండ ప్రాజెక్టుకు సరిపడ నిధులు ఇవ్వకుండా…ఎలా పూర్తి చేస్తారు?… ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సీఎం సార్… రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్ బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దివ్య సముఖమునకు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్ బహిరంగ లేఖ…

                     విషయం- వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కొరకు -  నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం జరుగుతున్న చివరి రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్'లో ప్రత్యేక నిధులు కేటాయించకుండా ఏ విధంగా పూర్తి చేస్తారు...? దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జ్, యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీ నిర్మాణం వంటి జిల్లా అభివృద్ధికి కారణమైన ప్రధానమైన వాటికి కేటాయింపులు లేకుండా జిల్లా అభివృద్ధి సాధ్యమా...?

     అయ్యా ! 
                   ఎన్నికల ముందు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిన మీ హామీ బుట్టదాఖలైంది. ఈ నాలుగు సంవత్సరాల మీ పరిపాలనలో మీతో పాటు సంబంధిత శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు, జిల్లాకు, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ అమావాస్యకి, పున్నమికి పూర్తి చేస్తామంటూ ప్రతి ఏడాది ప్రాజెక్టును సందర్శించి వస్తూ పోతూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామంటూ మాట ఇస్తూనే ఉన్నారు. ప్రధానమైన నిర్వాసితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. ముంపు గ్రామాల ప్రజల కోసం కేటాయించిన పునరావాస కాలనీలలో పనులు నత్త నడకన నడుస్తూనే ఉన్నాయి. టన్నెల్ నుండి స్టోరేజ్ వరకు మెయిన్ కాలువ పనులు, మిగతా కాలువల పనులు పూర్తి కాలేదు.

 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలోని నిర్వాసితుల జాబితాలో అధికారులు రోజుకొక నిబంధన పెడుతూ, నిర్వాసితులను గందరగోళ పరిస్థితులు కలుగజేస్తూ సర్వేల  పేరుతో కాలయాపన చేస్తూ అవార్డును నేటికీ ప్రకటించలేదు. ఈ క్రమంలో జిల్లాలోని చీమకుర్తి విచ్చేసిన తమరు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు ఇస్తానని లేకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడగనని వాగ్దానం చేసి ఉన్నారు. మాట తప్పని మడమతిప్పని పేరున్న మీరు ఈ వాగ్దానం నెరవేర్చుకోవడానికి సుమారు 2000 కోట్ల రూపాయల నిధులు లేనిదే ప్రాజెక్టు పూర్తి కాదనేది జగమెరిగిన సత్యం.

 కానీ ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ కేటాయింపుల్లో 101.47 కోట్ల నిధులు మాత్రమే కేటాయింపులు జరిగాయి. ఈ నిధులతో ప్రాజెక్ట్ పనులు ఏ విధంగా పూర్తి చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కోసం మరియు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం అందుకు అవసరమైన నిధులు ఈ బడ్జెట్ సమావేశంలో కేటాయించకుండా ఏ విధంగా పూర్తి చేస్తారో చెప్పాలని కోరుతున్నాం. అత్యంత వెనుకబడిన నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ఈ ప్రాంత ప్రజల జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించాలని అందుకు తగిన నిధుల విడుదలకు డిమాండ్ చేస్తున్నాం.

 అంతే కాకుండా నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న జిల్లా అభివృద్ధికి మూల కారణమైన చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన దొనకొండ పారిశ్రామిక కారిడార్, కనిగిరి నిమ్జ్, జిల్లా యూనివర్సిటీ -త్రిబుల్ ఐటీ వంటి వాటి నిర్మాణాలకు ప్రత్యేక నిధులు లేకుండా ఈ జిల్లా అభివృద్ధి లేదు. మీ పాలనలో జిల్లా అత్యధికంగా అభివృద్ధి జరుగుతుందని, చేస్తారని ఆశించి గత ఎన్నికలలో ఈ జిల్లా నుండి అత్యధిక స్థానాలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన తీరును మరువరాదని, ఈ జిల్లా ప్రజల ఆర్తనాదిని వినాలని ప్రార్థిస్తున్నాను. కావున జిల్లా అభివృద్ధికి కారణమైన ఈ బహిరంగ లేఖలో తమరికి విన్నవించి రాసిన అంశాలపై శ్రద్ధ వహిస్తారని ఈ జిల్లా అభివృద్ధికి తమరు తగిన ప్రాధాన్యత వహించి అవసరమైన నిధుల విడుదలకు కృషి చేస్తారని ప్రార్థిస్తూ తమరి దివ్య సముఖమునకు ఈ బహిరంగ లేఖ వ్రాసుకొనుచున్నాము.

SAKSHITHA NEWS