A young man died in a road accident
నిమ్స్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి జీవన్మృతుడయ్యాడు. అతడి గుండె ఆగిపోక ముందే మరో మనిషికి అమర్చి ప్రాణం పోశారు నిమ్స్ వైద్యులు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన షేక్ షనాజ్(29)కు గుండె సంబంధిత సమస్య ఉంది. పలు ఆస్పత్రుల్లో చూపించినా ఫలితం లేదు. దీంతో అతన్ని నిమ్స్‌కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గుండె ఎడమ వైపు జఠరిక వద్ద సమస్య (డైలేటెడ్ కార్డియోమయోపతి) ఉత్పన్నం అయ్యినట్లు గుర్తించారు. గుండె పనితీరు మందగించడంతో శరీరానికి చేరవేయాల్సిన రక్తాన్ని పంపింగ్ చేయడం లేదు. గుండె మార్పిడి చేయాలని సూచించారు.
వైద్యులు సూచన మేరకు తెలంగాణ జీవన్‌దాన్‌లో గుండె దాత కోసం పేరు నమోదు చేయించుకున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడు (21) రెండురోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అతన్ని సికింద్రాబాద్ యశోదాకు తరలించారు. పరీక్షించిన వైద్యులు జీవన్మృతుడు (బ్రెయిన్‌డెడ్) అయినట్లు నిర్ధారించారు. దీంతో అతని గుండెను తరలించేందుకు ట్రాఫిక్ పోలీసుల సాయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 8.10 గంటలకు యశోద నుంచి బయలుదేరిన ప్రత్యేక అంబులెన్స్ 7.1 కిలోమీటర్ల దూరంలోని నిమ్స్‌కు కేవలం 8 నిమిషాల్లో చేరింది. కార్డియోథొరాసిక్ విభాగాధిపతి అమరేశ్వరరావు సారథ్యంలో డా.గోపాల్, వైద్య బృందం విజయవంతంగా గుండె మార్పిడి చేశారు. వైద్యులను నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ అభినందించారు. జీవన్మృతుడి ఊపిరితిత్తి 1, కాలేయం, 2 మూత్రపిండాలు వేరే వారికి అమర్చినట్లు జీవన్‌దాన్ ఇన్‌ఛార్జి డా.సర్ణలత తెలిపారు.