SAKSHITHA NEWS

శ్రీ శైలం: నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఇవాళ శ్రీశైలం డ్యామ్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం పరిశీలించనుంది.

మంగళవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీశైలం ప్రాజెక్టును, 13, 15వ తేదీల్లో నాగార్జునసాగర్‌ డ్యామ్‌ను పరిశీలించనుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్. గత నెల 9న కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో తెలంగాణ, ఏపీతో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా.. ఈ తనిఖీలు చేపట్టనుంది.

ఈ బృందంలో ఎన్డీఎస్‌ఏ నుంచి ముగ్గురు, సీడబ్ల్యూసీ, కే‎ఆర్‌ఎంబీ, ఏపీ, సీఎస్‌ఎంఆర్‌ఎస్, తెలంగాణ నుంచి చెరో అధికారి కలిపి మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉండనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద విడుదల చేస్తుండడంతో దిగువ భాగంలో 40 మీటర్లలోతు గుంత ఏర్పడింది. దిగువ భాగంలో రక్షణ చర్యలతో పాటు కాంక్రీట్ వాల్ నిర్మాణం, స్పిల్ వేకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుందని.. దీనికి 800 కోట్ల రూపాయలు అవసరమని కేఆర్‌ఎంబీ గతంలో అంచనా వేసింది.

ఇక నాగార్జునసాగర్‌ స్పిల్ వే ఓగిలో కాంక్రీట్ పనులు, సీపేజీ గుంతలకు మరమ్మతులు, కుడికాలువ హెడ్ రెగ్యూలేటరీ గేట్లకు మరమ్మతులు, పూడికను బయటకు పంపే గేటు మార్పిడి వంటి పనులు చేయాల్సి ఉందని.. కేఆర్‌ఎంబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు 20 వేల కోట్ల రూపాయలు అవసరంకానున్నాయి. ఎన్డీఎస్‌ఏ టీమ్ తనిఖీల అనంతరం రెండు ప్రాజెక్టుల మరమ్మతులపై కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

WhatsApp Image 2024 02 06 at 11.56.32 AM

SAKSHITHA NEWS