డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలి.

Spread the love

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. డ్రై డే ను పురస్కరించుకుని కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి, నగరంలోని 28వ డివిజన్, ప్రకాశ్ నగర్ కుమ్మరివాడలో పర్యటించి ప్రజల్లో డెంగ్యూ దోమల నియంత్రణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటింటికి తిరుగుతూ, వృధాగా ఉన్న వస్తువులు, నీరు నిల్వ ఉన్న వస్తువులు ప్రదేశాలు పరిశీలించి, నీటి నిల్వతో డెంగ్యూ దోమలు వృద్ధి చెందుతాయని, నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మట్టి కుండలు, మట్టి ఇతర పాత్రలు, వస్తువులను పరిశీలించి, నీరు చేరకుండా జాగ్రత్తలు చేపట్టాలని, కేవలం మన ఇల్లు కాకుండా, పరిసరాలు పరిశుభ్రంగా, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆయన తెలిపారు. శ్రీనివాస నగర్ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో నమోదైన డెంగ్యూ పాజిటివ్ కేసు విషయంలో తీసుకున్న చర్యలు గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించి, ఆ కేసు ఇంటి లోపల, బయట, పరిసరాల్లో పైరిత్రం పిచికారీ చేయించి, వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వైద్యాధికారి కలెక్టర్ కు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారి చుట్టుప్రక్కల ఇంటింటికి సర్వే చేసి శాంపిల్స్ సేకరించి లక్షణాలను గుర్తించేందుకు పరీక్షలు చేయాలని, తద్వారా డెంగ్యూకి గురైన ఇంటితో పాటు చుట్టూ ప్రక్కల ఇళ్లల్లో కూడా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈడీస్ ఈజిప్టే అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని, నవజాత శిశువులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ కలిగియున్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. దోమల నియంత్రణతో వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాలు డ్రై డే లుగా పాటించాలని, ఆ రోజుల్లో ఇల్లు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటిలో ఉన్న నీటి తొట్టెలు, సిమెంట్ కుండీలు, డ్రమ్ములలో ఉన్న నీటిని మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, ఆరబెట్టినా తరవాత నీరు నింపుకోవాలన్నారు. దీనివల్ల ఈడిస్ దోమ జీవిత చక్రానికి అంతరాయం ఏర్పడి, లార్వాలు అంతరిస్తాయన్నారు. దోమల నియంత్రణలో ప్రజలు పాలుపంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. పనికిరాని గుంతలను, లోతట్టు ప్రదేశాలను, వాడని బావులను పూడ్చి, నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్ కప్పులు, పగిలిపోయిన మట్టి కుండలు, పాడైన టైర్లు లేకుండా అన్నారు. దోమల నివారణకు యాంటీ లార్వా కార్యాచరణ చేయాలని, పాగింగ్ నిర్వహించడం ద్వారా దోమల వృద్దిని కట్టడికి చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గజ్జెల లక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారిణి డా. బి. మాలతి, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఉప కమీషనర్ మల్లీశ్వరి, డిఇ స్వరూపారాణి, మెడికల్ ఆఫీసర్ డా. లోహిత, అధికారులు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page