హైదరాబాద్:-:పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌ను సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారు. నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి డబ్బులు కొల్లగొడుతున్నారు.దీనిని నిర్ధారించుకున్న పోలీస్ అధికారులు బహుపరాక్ అంటూ వాహనదారులను హెచ్చరిస్తున్నారు. లక్షల్లో పేరుకుపోయిన చలాన్లను క్లియర్ చెయ్యటానికి ప్రభుత్వం ఇటీవల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. మీ సేవా సెంటర్లతో పాటు https://echallan.tspolice.gov.in/publicview/ అన్న పేరుతో వెబ్ సైట్‌ను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
ఇక, ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. సరిగ్గా దీనినే సైబర్ క్రిమినల్స్ అవకాశంగా మలుచుకున్నారు. https ://echallantspolice.in/ అన్న పేరుతో నకిలీ వెబ్ సైట్‌ను రూపొందించారు. దీని ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొడుతున్నారు. ఇంటర్ నెట్‌లో నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని సూచించారు. నకిలీ వెబ్ సైట్లను రూపొందించిన వారిని గుర్తించేందుకు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు