SAKSHITHA NEWS

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని MG రోడ్డు లో రాంగోపాల్ పేట డివిజన్ వార్డు ఆఫీస్, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలాక్ పూర్ లో స్ధానిక MLA ముఠా గోపాల్ తో కలిసి వార్డు ఆఫీస్, అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని తిలక్ నగర్ లో స్థానిక MLA కాలేరు వెంకటేష్ తో కలిసి వార్డు ఆఫీస్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన తమ సమస్యల పరిష్కారం కోసం వేరు వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. వార్డు ఆఫీస్ వ్యవస్థ వలన GHMC పరిధిలోని GHMC, ఎలెక్ట్రికల్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు అంతా ఒక్క చోట ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులకు కూడా ప్రజల నుండి వచ్చే సమస్యలపై సకాలంలో స్పందించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. GHMC పరిధిలోని 150 డివిజన్ లలో డివిజన్ కు ఒకటి చొప్పున గతంలో 137 వార్డు ఆఫీసులను ప్రారంభించడం జరిగిందని, మిగిలిన 13 ఆఫీసులను ఈరోజు ప్రారంభించి ప్రజలకు అందుబాటులో కి తీసుకొచ్చినట్లు వివరించారు.

ప్రజల సౌకర్యార్థం, ప్రజలకు మేలు చేసే ఉద్దేశం తో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఇబ్బందులు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS