నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం

Spread the love

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో 500 మంది లబ్ధిదారుల ఎంపిక

పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల గుర్తింపు

పేదలకు ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ

పేదోళ్లకు పెద్దన్న సీఎం కేసీఆర్

ఎంపికైన లబ్ధిదారులకు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

హాజరైన జిల్లా కలెక్టర్ శరత్ కుమార్

పటాన్చెరు

నిరుపేదలకు ఆధునిక వసతులతో అత్యంత ఖరీదైన ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించి, వారి జీవితాల్లో నూతన వెలుగులు నింపిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

బుధవారం పటాన్చెరువు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో. మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో నిర్వహించారు.

ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో.. అర్హులైన 4137 మంది లబ్ధిదారుల లిస్టుని రాండమైజేషన్ పద్ధతిలో 500 మంది లబ్ధిదారులను మొదటి విడతగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… కడు పేదరికం అనుభవిస్తూ.. చాలీచాలని జీతాలతో జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలకు ఆత్మగౌరవంతో జీవించాలన్న సమున్నత లక్ష్యంతో అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగిందని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు, ఉస్మాన్ నగర్, అమీన్పూర్ పరిధిలో నిర్మించిన 30 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో.. పటాన్చెరుకి నాలుగు వేల ఇళ్లను కేటాయించడం జరిగిందని తెలిపారు.

జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో 9900 మంది దరఖాస్తు చేసుకోగా, 4137 మందిని అర్హులుగా గుర్తించి జాబితా తయారు చేయడం జరిగిందని తెలిపారు.

మొదటి విడతగా 500 మందిని పూర్తి పారదర్శకతతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.

మిగిలిన లబ్ధిదారులకు విడతలవారీగా లాటరీ పద్ధతిన కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.

వీటితోపాటు ఆయా గ్రామాల రెవెన్యూ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోనూ స్థానికులకు కేటాయింపులు జరుగుతాయని తెలిపారు. ఇందుకు అనుగుణంగా మరో రెండు వేల ఇళ్లను వీరికి కేటాయించబోతున్నట్లు తెలిపారు.

నిరుపేదల కోసం కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం ఆసియాలోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీగా గుర్తింపు పొందని ఆనందం వ్యక్తం చేశారు. ఎంపికైన లబ్ధిదారులందరికీ పండగ వాతావరణంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు.

మొదటి విడతలో ఎంపికైన పటాన్చెరు పట్టణం జేపీ కాలనీకి చెందిన శ్రీలక్ష్మికి ఎమ్మెల్యే జిఎంఆర్ స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తమ జీవితంలో సొంతింటి కల సాకారం అవుతుందని అనుకోలేదని తీవ్ర బాగోద్వేగానికి లోనయ్యారు.

జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. పైరవీకారులకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. విడతలవారీగా మిగిలిన లబ్ధిదారులకు ఇళ్ళను కేటాయించడం జరుగుతుందని తెలిపారు

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, తహసిల్దార్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page