విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది.
-జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్
…….
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
విద్యా, వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, కోట్లాది రూపాయలు వెచ్చించి, అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్ అన్నారు. మంగళవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం వైద్య, విద్య పరంగా ఎంతో అభివృద్ధి చెందినదని అన్నారు. సబ్ సెంటర్లు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించి, పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు.
పరిశుభ్రత, డ్రై డే గురించి ప్రజల్లో ప్రజాప్రతినిధులు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి కరునించిందని, వర్షాలు పడుతుండడంతో చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయని అన్నారు. త్రాగు నీటి సమస్య ఎదురయ్యేది లేదని ఆయన తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పోరేట్ పాఠశాలల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు మారాయని అన్నారు. అన్ని మౌళిక వసతులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో పిల్లలకు ఉచిత, నాణ్యమైన విద్య లభిస్తున్నదని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చైర్మన్ అన్నారు. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ప్రతి శుక్రవారం చేపట్టే డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
డ్రై డే అంటే కేవలం పరిశుభ్రంగా వుండడం, మొక్కలు నాటడమే కాదని, ఇల్లు, పరిసరాల్లో పరిశుభ్రత, నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమలు అభివృద్ధి చెందకుండా చూడడం అన్నారు. డెంగ్యూ పై అధికారులు అందరు అవగాహన కల్గి వుండాలని, ప్రజల్లో దోమల నియంత్రణపై అవగాహన కల్పించడం చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు డ్రై డే పాల్గొని, ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. ఫాగింగ్ యంత్రాల ఆవశ్యకతపై ప్రతిపాదనలు సమర్పిస్తే, సమకూర్చుటకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని అన్ని సబ్ సెంటర్లకు ప్రభుత్వ భవనాలు మంజూరు అయినట్లు, 30 సబ్ సెంటర్ల నిర్మాణాలు పూర్తికాగా, 56 భవనాల నిర్మాణం ప్రగతిలో వుందని తెలిపారు.
జిల్లాలో మన ఉరు-మన బడి క్రింద 426 పాఠశాలలు మెదటి విడతగా ఎంపిక చేసి, 177 పాఠశాలల పనులు పూర్తి అయినట్లు తెలిపారు. 101 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు కావాల్సివుందని, 76 పాఠశాలల్లో పెయింటింగ్ పనులతో సహా పూర్తి కాగా, 57 పాఠశాలలు పునః ప్రారంభం చేసినట్లు, 209 పాఠశాలల్లో సివిల్ పనులు పూర్తికాగా, ఇప్పటివరకు రూ. 32 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన అన్నారు. పనులు పూర్తయితే, డ్యూయల్ డేస్కులు వస్తాయని, త్వరితగతిన పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 9 సంవత్సరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో గణనీయమైన ప్రగతి సాధించామని, రాబోయో రోజుల్లో సైతం అదే ఒరవడితో ముందుకు వెళ్లాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల, రెవెన్యూ అదనపు కలెక్టర్లు బదిలీపై వెళ్లిన వారి సేవలను కొనియాడుతూ, జిల్లాకు కేటాయించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో కార్పోరేటు స్థాయిలో సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయం నిర్మించుకోవడం, మంచి పరిపాలన సౌలభ్యం అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వైద్యం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబర్చి అత్యాధునికమైన వైద్య పరికరాలను సమకూర్చి రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. వైద్య చికిత్సకు ఇతర జిల్లాల నుండి మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే 100 వైద్య విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతాయన్నారు.
సమావేశంలో పాల్గొన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల స్థాయి పెంచి అన్ని వసతుల కల్పన చేస్తున్నట్లు తెలిపారు. వైద్య విధాన ఆసుపత్రులకు నూతన భవనాలు మంజూరుచేసి, నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన అన్నారు. లక్షణాలు లేకుండా డెంగ్యూ వస్తున్నట్లు, ఈ దిశగా వైద్య ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి, సర్పంచ్, పంచాయితి కార్యదర్శులను అప్రమత్తం చేయాలన్నారు. ఫాగింగ్, ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన కిట్స్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో వుంచాలన్నారు. ప్రభుత్వ చర్యలతో సీజనల్ వ్యాధులు నియంత్రణలో వున్నాయని ఆయన తెలిపారు.
ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభం అయ్యాయని, వైద్య ఆరోగ్య, పంచాయితీరాజ్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. సమావేశంలో ఖమ్మం జిల్లా పది సంవత్సరాల అభివృద్దిపై రూపొందించిన బుక్ లెట్, డెంగ్యూ పై అవగాహన, నియంత్రణ చర్యల గురించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జెడ్పి సీఇఓ వి.వి. అప్పారావు, జిల్లా అధికారులు, ఎంపిపిలు, జడ్పీటిసిలు తదితరులు పాల్గొన్నారు.