కేంద్రం సహకరించకున్నా.. కేసీఆర్
రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్నారు
- రాజ్యసభ ఎంపీ వద్దిరాజు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో సహకరించకపోయినా.. కేంద్రం నుంచి కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకపోయినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు మయం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. సొంత రాష్ట్రంలో.. సొంత నిధులతో అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన దిశ కమిటీ సమావేశానికి ఎంపీ రవిచంద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా పురోగతి సాధించడం వెనుక.. కేసీఆర్ దూర దృష్టి.. యువనేత కేటీఆర్ కృషి ఉన్నాయని చెప్పారు. ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనువైన వాతావరణం కల్పించడం వల్లే.. కొత్త.. కొత్త పరిశ్రమలు తెలంగాణ చుట్టూ ఏర్పాటవుతున్నాయని చెప్పారు. చిన్న, చిన్న కారణాలు చూపి.. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పోయేలా చేసుకోవద్దని సూచించారు. ఆరోగ్య రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉందని అన్నారు. ప్రతి జిల్లా లో ఒక మెడికల్ కాలేజీ నెలకొల్పి.. ఆరోగ్య తెలంగాణకు అంకురార్పణ చేశారని గుర్తు చేశారు.
లోక్ సభ ఎంపీ నామా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, అదనపు కలెక్టర్లు మధుసూదన్, స్నేహలత, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.