కామారెడ్డి:
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దారుణ హత్య జరిగింది. రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామ సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. నర్సాగౌడ్ ముఖంపై గాయాలు ఉండడంతో ఎవరో కావాలని హత్య చేశారని సింగరాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత వారం రోజులుగా గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. వాటిని దృష్టిలో పెట్టుకుని కావాలనే నర్సాగౌడ్‌ను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. నర్సాగౌడ్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరి ఉదయం వరకు ఇంటికి రాలేదు.
ఉదయం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో నర్సాగౌడ్ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్సాగౌడ్ గతంలో సింగరాయపల్లి ఎంపీటీసీగా, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడుగా, మాచారెడ్డి ఇంచార్జి ఎంపీపీగా కూడా పనిచేశారు. నర్సాగౌడ్ హత్య జరిగిన ఘటనా స్థలానికి కామారెడ్డి డీఎస్పీ సురేష్, రూరల్ సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ ప్రసాద్‌లు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు….