SAKSHITHA NEWS

ఖ‌మ్మం : వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడు వ‌ద్ద జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. అగ్నిప్ర‌మాదం ఘ‌ట‌న‌పై కేటీఆర్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఖ‌మ్మం జిల్లా బీఆర్ఎస్ నేత‌ల‌తో, అధికారుల‌తో కేటీఆర్ మాట్లాడారు. మృతుడి కుటుంబం, క్ష‌త‌గాత్రుల‌ను ఆదుకుంటామ‌న్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందించాల‌ని కేటీఆర్ ఆదేశించారు..

చీమ‌ల‌పాడు వ‌ద్ద నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళనానికి బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు, వైరా ఎమ్మెల్యేతో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. అయితే నేత‌ల‌ను ఆహ్వానిస్తూ కార్య‌క‌ర్త‌లు బాణాసంచా పేల్చారు. దీంతో ఆ నిప్పుర‌వ్వలు ఎగిరిప‌డి స‌భా ప్రాంగ‌ణానికి 200 మీట‌ర్ల దూరంలో ఉన్న గుడిసెపై ప‌డ్డాయి. దీంతో గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండ‌ర్‌కు మంట‌లు అంటుకుని అది పేలిపోయింది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో ఒక‌రు మృతి చెందారు. ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. క్ష‌త‌గాత్రుల‌కు ఖ‌మ్మం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.


SAKSHITHA NEWS