SAKSHITHA NEWS

PV Krishe is world class recognition for India

భారత్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు పీవీ కృషే
పీవీ తనయుడు ప్రభాకర్ రావు


హైదరాబాద్,

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను ప్రపంచ స్థాయికి పెంచిన గొప్ప నాయకుడని ఆయన తనయుడు, టీఏజేఎఫ్ చాంబర్స్ కమిటీ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు. దివంగత ప్రధాని పీవీ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్, హైదరాబాద్లో గల పీవీ జ్ఞానభూమి వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, పీవీ కుటుంబీకులు పీవీ ఘాట్ వద్ద పూలమాలవేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రభాకర్ రావు అక్కడే మీడియాతో మాట్లాడారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు దేశం చాలా రంగాల్లో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. మారుమూల గ్రామం నుంచి ఢిల్లీ పీఠానికి ఎదిగే అవకాశం పీవీ పొందారని కొనియాడారు. ఎవ్వరినీ నొప్పించక… అందరినీ మెప్పించి తన పని, తాను చేసుకొని పీవీ ముందుకు వెళ్ళారని చెప్పారు. అంతేస్థాయిలో దేశ ఆర్థిక రంగాన్ని కూడా పరుగులు పెట్టించారని స్పష్టం చేశారు.

ఆయన సంస్కరణల ఫలితంగా నేడు దేశంలో ఐటీ పరిశ్రమ పెద్ద ఎత్తున ఎదిగిందన్నారు. దేశవ్యాప్తంగా పీవీ నిజాయితీగా పనిచేసిన నాయకుడుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. భారత్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన మహానీయుడు తెలుగు, తెలంగాణగాణ వాడు కావడం మనందరికీ గర్వకారణమని వివరించారు. ప్రధానిగా ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి? అని నిరూపించిన మహానుభావుడు పీవీ నరసింహారావు అన్నారు.

ఘనంగా పీవీ వర్ధంతి వేడుకలు

భారతదేశం మాజీ ప్రధానమంత్రి , కీర్తిశేషులు పీవీ నరసింహారావు 18వ వర్ధంతి వేడుకలను హైదరాబాదులోని పీవీ ఘాట్ లో ఘనంగా జరిగాయి . ఈ సందర్భంగా పీవీ నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పివి, నరసింహారావు కుమారుడు, టీఏజేఎఫ్ చాంబర్స్ కమిటీ చైర్మన్ పీవీ ప్రభాకర్ రావు, రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు, శేఖర్ మారం రాజు, జీవన్, ఉప్పాలియా తదితరులు పాల్గొని నెక్లెస్ రోడ్డులోని పివి ఘాటులో ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సురభి వాణిదేవి మాట్లాడుతూ భారతదేశానికి పీవీ నరసింహారావు ఎనలేని కృషి చేశారని వ్యాఖ్యానించారు. దేశంలో అనేక సంస్కరణలు చేశారని, నిరుపేద కుటుంబాలకు పెద్ద ఎత్తున సహాయ, సహకారాలు అందించడమే కాకుండా అనేక సంక్షేమ పథకాలను చేపట్టారని అన్నారు.

అంతకుముందు రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్, సీనియర్ కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్, కేవీపీ రాంచందర్ రావు, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ గౌడ్, బీజేపీ నేత ఎన్వీ సుభాష్, బీజేపీ అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్ రెడ్డి,

టీడీపీ అధికార ప్రతినిధి నేత తిరునగరి జ్యోత్న్స తదితరులు పీవీ ఘాటుకు వచ్చి పీవీ సమాధి వద్ద పూల పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు సామాజిక వేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పీవీ ఘాటు వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.


SAKSHITHA NEWS