Will stand by the workers.. Supermax company workers who met the MLA on the issues...
కార్మికులకు అండగా ఉంటా.. సమస్యలపై ఎమ్మెల్యేను కలిసిన సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో గల సూపర్ మాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్న సుమారు 400 మంది కార్మికులు
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హెచ్.ఎం.ఎస్, సి.ఐ.టి.యు, టి.ఆర్.ఎస్.కె.వి కార్మిక యూనియన్ ల ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సూపర్ మాక్స్ కంపెనీలో సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు పని చేస్తున్నామని, గత 16 నెలలుగా కంపెనీ సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, గత 6 నెలల నుండి సగం జీతం ఇస్తూ, గత మూడున్నర నెలల నుండి పూర్తిగా జీతాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తమ సమస్యలు తీసుకువచ్చారు.
అంతే గాక రిటైర్ అయిన కార్మికులకు డెత్ రిలీఫ్ ఫండ్, రిజైన్ చేసిన కార్మికులకు సెటిల్ మెంట్ లు, ఒక్కో కార్మికుడికి సుమారు రూ.2 లక్షల వరకు రావాల్సిన బకాయిలు కంపెనీ చెల్లించాల్సి ఉండగా.. అవ్వన్నీ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు అండగా నిలిచి, తీవ్రమైన ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని కార్మికులు కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కష్టపడి పని చేస్తూ.. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు, బకాయిలు కంపెనీ యాజమాన్యం కార్మికులకు చెల్లించే వరకు ముందుండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దృష్టికి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి కార్మికులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.