SAKSHITHA NEWS

Thanks to all those who made the film ‘Odela Railway Station’ with faith and were a part of its success I am honored. Sampath Nandi

హెబ్బా ప‌టేల్, వ‌శిష్ట ఎన్‌.సింహ‌, సాయి రోన‌క్‌, పూజిత పొన్నాడ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’. కె.కె.రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి క‌థ‌ను అందించారు. ఆగ‌స్ట్ 26 నుంచి తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. రా అండ్ రస్టిక్, ఇన్‌టెన్స్ మూవీగా ఓదెల రైల్వేష‌న్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఈ స‌క్సెస్‌ను శుక్ర‌వారం చిత్ర యూనిట్ సెల‌బ్రేట్ చేసింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు షీల్డుల‌ను అందించ‌టంతో పాటు కేక్ కూడా క‌ట్ చేసింది చిత్ర బృందం.

ప్రతి శుక్రవారం కొత్త కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తామ‌ని చెప్ప‌ట‌మే .. చెప్పిన మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తోన్న మాధ్య‌మం ‘ఆహా’. తెలుగు ఆడియెన్స్ మెచ్చే, న‌చ్చే కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న 100% తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ఓదెల రైల్వేష‌న్ రిలీజై వైవిధ్యమైన చిత్రంగా ఇటు ప్రేక్ష‌కులు, అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

గ‌గ‌న్ మాట్లాడుతూ ‘‘సంపత్ నందిగారు పెద్ద దర్శకుడిగా సినిమాలు చేస్తున్నప్పటికీ చిన్న సినిమాలను కూడా రూపొందిస్తూ కొత్త నటీనటులను బాగా ఎంక‌రేజ్ చేస్తుంటారు. ఈ సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది.  సంప‌త్ నందిగారితో, డైరెక్ట‌ర్ అశోక్ తేజ‌గారితో మంచి అనుబంధం ఏర్ప‌డింది. హెబ్బా ప‌టేల్‌, వ‌శిష్ట సింహ‌, సాయి రోన‌క్‌గారికి థాంక్స్‌. ఓదెల రైల్వే స్టేష‌న్‌ను ప్ర‌తి తెలుగువారికి ద‌గ్గ‌ర చేసిన ఆహా టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

డైరెక్టర్ అశోక్ తేజ మాట్లాడుతూ ‘‘‘ఓదెల రైల్వేస్టేష‌న్‌’ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఇంత మంచి క‌థ‌ను అందించిన సంప‌త్ నందిగారికి, నాకు ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇచ్చిన రాధా మోహ‌న్‌గారికి జీవితాంతం రుణ ప‌డి ఉంటాను. అలాగే ఆహా టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌’’ అన్నారు.

నిర్మాత కె.కె.రాధా మోహ‌న్ మాట్లాడుతూ ‘‘ఏమైంది ఈవేళ చిత్రం నుంచి నాకు, సంపత్‌కి మ‌ధ్య అనుబంధం కొన‌సాగుతోంది. ప్రేక్ష‌కులు కూడా ఆదిరిస్తున్నారు. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో సంప‌త్ ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌ను చెప్ప‌గానే వెంట‌నే ఒప్పుకున్నాను. అంత‌కు ముందు మా బ్యాన‌ర్‌లో చేసిన ఒరేయ్ బుజ్జిగా చిత్రాన్ని ఆహా డైరెక్ట్ రిలీజ్ చేసింది. స‌బ్జెక్ట్‌ను న‌మ్మి చేసిన చిత్ర‌మిది. పెద్ద సినిమాల‌కు ప‌ని చేసిన డీఓపీ సౌంద‌ర్ రాజ‌న్ మా ఓదెల రైల్వే స్టేష‌న్‌కు వ‌ర్క్ చేయ‌టం చాలా సంతోషానిచ్చింది.

కోవిడ్ స‌మయంలో చాలా కేర్ తీసుకుని షూటింగ్ చేశాం.  మా సినిమాను న‌మ్మి దాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ముందుకు వ‌చ్చిన ఆహా యాజ‌మాన్యానికి ధ‌న్య‌వాదాలు. క‌థ విన‌గానే వ‌శిష్ట అయితే ఎలాంటి రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండా యాక్ట్ చేస్తాన‌న్నాడు. డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించాడు. పూజిత పొన్నాడ‌కు థాంక్స్‌. హెబ్బా ప‌టేల్‌.. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఈ రోల్ చేయాల‌నుకోవ‌టమే, ఆ రోల్ చేసిన తీరు అభినంద‌నీయం. అశోక్ తేజ అండ్ టీమ్ మంచి సినిమాను అందించారు. అందరికీ థాంక్స్‌’’ అన్నారు.

సాయి రోన‌క్ మాట్లాడుతూ ‘‘‘ఓదెల రైల్వేస్టేష‌న్‌’లో ఐపీఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించ‌టానికి చాలా ప్రిపేర్ అయ్యాను. సంప‌త్ నందిగారు, మా డైరెక్ట‌ర్ అశోక్‌గారు ఎంతో హెల్ప్ చేశారు. సంప‌త్‌గారైతే వాయిస్ మెసేజ్‌ల‌ను పంపుతూ, స‌ల‌హాల‌ను ఇస్తూ గైడ్ చేశారు. అది నాలో ఎంతో కాన్ఫిడెన్స్ పెంచింది. ఆహాలో ఏ కంటెంట్ ఓపెన్ చేసినా చూడ‌బుద్దేస్తుంది. అంత మంచి కంటెంట్ అందులో బాటులో ఉంటుంది. ఇప్పుడు ఓదెల రైల్వే స్టేష‌న్‌తో వారితో అనుబంధం ఏర్ప‌డ‌టం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

వ‌శిష్ట ఎన్‌.సింహ మాట్లాడుతూ ‘‘ఓదెల రైల్వేస్టేష‌న్ స‌క్సెస్ చూస్తుంటే మాటలు రావటం లేదు. లాక్ డౌన్ స‌మ‌యంలో అంద‌రం ప‌ని చేయ‌కుండా ఇంటికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఇలాంటి ఓ కంటెంట్‌ను క్రియేట్ చేసిన సంప‌త్ నందిగారికి, రాధా మోహ‌న్‌గారికి థాంక్స్‌. ప‌ని లేకుండా చాలా మంది ఉన్న‌ప్పుడు ఇలాంటి సినిమా చేయాల్సి వ‌స్తే.. చాలా మందికి ప‌ని దొరుకుతుందనే ఫీలింగ్‌తో నేను రెమ్యున‌రేష‌న్ తీసుకోన‌ని చెప్పాను. అందుకే సినిమాలో భాగ‌మ‌య్యాను. డైరెక్ట‌ర్ అశోక్ నాకు మ‌రో సినిమా క‌థ కోసం వ‌చ్చి నెరేష‌న్ ఇచ్చారు. అది నాకు న‌చ్చ‌లేద‌ని చెప్పేశాను. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రికీ ప‌రిచ‌యం ఏర్ప‌డింది. మ‌ళ్లీ రెండు నెల‌లు త‌ర్వాత త‌ను ఫోన్ చేసి బెంగుళూరుకి వ‌చ్చి క‌లిశాడు. ఓదెల రైల్వేస్టేష‌న్ కాన్సెప్ట్ చెప్పాడు.

విన‌గానే న‌చ్చింది. సంప‌త్‌గారు నాకు ఫోన్ చేసి రెండు గంట‌ల‌కు పైగానే నెరేష‌న్ ఇచ్చారు. ఇక్క‌డ‌కు వచ్చిన త‌ర్వాత ఎక్క‌డ్నుంచి వ‌చ్చాడు అనేలా చూశారంద‌రూ . అయితే రెండు, మూడు రోజుల్లో అంద‌రూ నాతో ఫ్యామిలీ మెంబ‌ర్స్‌లా క‌లిసిపోయారు. ఇంత మంచి స్క్రిప్ట్‌, మంచి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఇచ్చిన డైరెక్ట‌ర్ అశోక్‌కి థాంక్స్. నా పాత్ర‌లో అద్భుత‌మైన వేరియేష‌న్ ఉంటుంది. అలాంటి పాత్ర‌ను నాకు ఇచ్చినందుకు థాంక్స్‌. హెబ్బా ప‌టేల్ త‌ను మంచి పెర్ఫామ‌ర్‌. త‌న ఇంట్ర‌డక్ష‌న్ సీనే సూప‌ర్బ్. సాయి రోన‌క్‌, గ‌గ‌న్ స‌హా అంద‌రూ వారి పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించారు’’ అన్నారు.

హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ ‘‘లాక్ డౌన్ సమయంలో చాలా బోరింగ్‌గా ఫీల‌య్యాను. ఏదైనా చేయాల‌ని అనుకుంటున్న‌ప్పుడు సంపత్ సార్ స్క్రిప్ట్ నెరేట్ చేస్తాన‌ని ఫోన్ చేసి వ‌చ్చి క‌లిశారు. నెరేట్ చేశారు. నా కంఫ‌ర్ట్ జోన్‌కు పూర్తి భిన్న‌మైన జోన‌ర్ మూవీ అని ఆయ‌న నెరేష‌న్ విన‌గానే అర్థ‌మైంది. అయితే సంప‌త్‌గారు నాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా నేను చేయగ‌ల‌నా అని షూటింగ్ ముందు వ‌ర‌కు అనుకుంటుండేదాన్ని. ఐదారు రోజుల త‌ర్వాత.. రాధ పాత్ర‌లోకి వెళ్లాను. నా కంఫ‌ర్ట్ జోన‌ర్‌ను వ‌దిలేశాను. ఇప్పుడు నా పాత్ర‌కు చాలా మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. వ‌శిష్ట్‌, సాయి రోన‌క్‌, గ‌గ‌న్ స‌హా అందరికీ థాంక్స్‌’’ అన్నారు.

సంప‌త్ నంది మాట్లాడుతూ ‘‘లాక్డౌన్‌లో ఏం చేయాలో తెలియ‌క ఆలోచిస్తున్న‌ప్పుడు మొదలైన జ‌ర్నీ ఇది. ఈ స‌క్సెస్ ఇద్ద‌రిది.  అందులో ఒక‌రు అశోక్ అయితే, మ‌రొక‌రు ఆహా. ఎందుకంటే ఈ సినిమాను అశోక్ కోసమే చేశాను. ఓదెల రైల్వే స్టేష‌న్ స‌క్సెస్ త‌న‌కే ద‌క్కుతుంది. లోక‌ల్ కంటెంట్ రీచ్ కావాలంటే లోక‌ల్ ఛానెల్ ద్వారానే బావుంటుంది. అలాంటి కనెక్ష‌న్ మాకు ఆహా ద్వారా దొరికింది. బాబు, విన‌య్‌, బాల ద్వారా మాకు అది దొరికింది. రాధా మోహ‌న్‌గారితో నాకు ఇది మూడో కాంబినేష‌న్‌. ఈ సినిమాకు ప‌నిచేసిన వాళ్ల‌లో చాలా మంది నా మీద గౌర‌వంతో రెమ్యున‌రేష‌న్స్ తీసుకోకుండా ప‌ని చేశారు. వారంద‌రికీ కూడా థాంక్స్‌. ఓదెల మా ఊరు. మా ఊరి పేరుపై సినిమా చేయ‌టం గ‌ర్వంగా అనిపిస్తోంది. ప్ర‌దీప్‌, గ‌ణేష్, శ్రీకాంత్ సినిమా లాంగ్వేజ్ ప‌రంగా ఎంతో స‌పోర్ట్ చేశారు. ఈ స‌క్సెస్‌లో భాగ‌మైన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో దివ్య‌, నాగ మ‌హేష్‌, సురేంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS