అందరూ పర్యావరణహిత మట్టి గణపతులనే పూజించాలి
రాష్ట్ర వ్యాప్తంగా మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 1.40 లక్షల ప్రతిమల పంపిణీకి శ్రీకారం
మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మంత్రులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షిత హైదరాబాద్, : పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రులు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ….పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్పీసీబీ పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తోందని, ఈ ఏడాది
రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కలర్స్, కెమికల్స్ తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని, మండపాల్లో, ఇళ్ళలో కూడా పర్యావరణహిత వినాయక ప్రతిమలను ప్రతిష్టించి… పూజిద్దామని పిలుపునిచ్చారు.
అంతకుముందు మంత్రులు వినాయక స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం స్వామి వారి డాలర్ లాకెట్ ను ఆవిష్కరించారు. ఓ వైపు గణపతి ప్రతిమ, మరోవైపు ఓంకారం ఉన్న లాకెట్ ను భక్తులకు విక్రయించనున్నారు. కొబ్బరి లడ్డు ప్రసాద విక్రయ సేవలను కూడా మంత్రులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సికింద్రాబాద్ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో వినోద్ రెడ్డి, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ జయరాజు, తదితరులు పాల్గొన్నారు.