శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
……….
సాక్షిత, తిరుపతి బ్యూరో: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలు జస్టిస్ రమణ కు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ ఆలయ ప్రదక్షిణగా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు . రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం జస్టిస్ రమణ దంపతులకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఎన్వీ రమణతో పాటు తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు పాల్గొన్నారు. కాగా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని కూడా భారత ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ సతీ సమేతంగా శుక్రవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. వీరికి టీటీడీ ఈ ఓ ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికి అమ్మవారి దర్శన అనంతరం శేష వస్త్రంతో ఆలయ మర్యాదలతో వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు ఏ వి రవీంద్రబాబు, దుప్పాల వెంకటరమణ, చక్రవర్తి విజయలక్ష్మి, తిరుపతి జిల్లా ఇంఛార్జి జస్టిస్ కొంగర విజయ లక్ష్మి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు లలితా కనిగేటి, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి భీమ్ రావు, తిరుపతి ఎడిజే చీఫ్ ప్రోటోకాల్ జస్టిస్ వీర్రాజు, కోటేశ్వర రావు ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ తదితర న్యాయమూర్తులు ఉన్నారు.