SAKSHITHA NEWS

దువ్వాడ వ్యవహారం.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రభావం.. వైసీపీ ఆందోళన.

దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. దివ్వెల మాధురితో తన సహజీవనాన్ని తన భార్య వాణి, బిడ్డలు హైందవి, నవీనాలు నిలదీస్తూ, ప్రశ్నించడం వెనుక తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించడం లేదు సరికదా, ఆయన వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దువ్వాడ తన వివాసం వద్దనే భార్య వాణి, కుమార్తెలతో వాగ్వాదానికి దిగడం అందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.

గత మూడు నాలుగు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలు, ఇరువురూ పరస్పరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోవడం, భార్యా కుమార్తెలతో దువ్వాడ శ్రీనివాస్ వాగ్వాదం ఇవన్నీ పార్టీకి శిరోభారంగా మారాయి. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి ప్ర‌భుత్వ ఉద్యోగి శాంతిల మధ్య సంబంధంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తడం, ఆ విషయంలో ఆ ఇరువురూ ఇచ్చిన వివరణలు మరింత వివాదం కావడం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై ర‌చ్చ‌న‌డుస్తున్న నేప‌థ్యంలోనే తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ రాస‌లీల‌ల వ్య‌వ‌హారం బహిర్గతం కావడంతో వైసీపీలో ఇలాంటి ఘన కార్యాలు చేసిన వాళ్లు చాలా మంది ఉన్నారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్ ల వ్యవహారాలను గుర్తు చేస్తూ నెటిజనులు వైసీపీని ఓ ఆటాడుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే పార్టీ నుంచి దువ్వాడకు ఎటువంటి మద్దతూ లభించడం లేదు. పైపెచ్చు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు దువ్వాడ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు పార్టీ వీడే యోచనలో ఉన్నారని అంటున్నారు. పార్టీ నాయకత్వం నుంచే కాదు.. కనీసం ఆయన నియోజకవర్గానికి చెందిన ఆయన అనుచరులు కూడా దువ్వాడకు మద్దతుగా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. దువ్వాడ వంటి నేతల తీరు కారణంగా వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


SAKSHITHA NEWS