స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీ అభ్యర్థులు సహకరించాలి
-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే
ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, పోటీ అభ్యర్థులు సహకరించాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ జి కోల్టే అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్, వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి, శంకర ఆనంద్ మిశ్రా లతో కలిసి రాజకీయ పార్టీలు, పోటీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు. డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణ కు నిఘా పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇవిఎం ల ప్రిపరేషన్, గుర్తుల లోడింగ్ లలో, స్ట్రాంగ్ రూం లను తెరిచెప్పుడు పోటీచేయు అభ్యర్థులు పాల్గొనాలన్నారు. పోలింగ్ ఏజంట్ల నియామకం చేయాలన్నారు. ఎక్కడైనా, ఏ పోలింగ్ కేంద్రాల్లోనైనా ఉద్రిక్తత చోటుచేసుంటుందని సందేహం ఉంటే సమాచారం ఇవ్వాలన్నారు. ఓటర్ హెల్ప్ లైన్, సువిధ యాప్, ఇఎంఎస్ పోర్టల్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పోలీస్ పరిశీలకులు చరణ్ జీత్ సింగ్ మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, సమస్యలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీములు క్రియాశీలకంగా పనిచేస్తాయన్నారు.
రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల లో 1896 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మొత్తం 1631039 మంది ఓటర్లు ఉన్నట్లు, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు వుండవన్నారు. ఓటర్లలో క్రొత్తగా చేర్పులు, తొలగింపులు వుండవన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ఇంటింటికి చేపడుతున్నట్లు ఆయన అన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు కేవలం సమాచారం కొరకు మాత్రమే నని, వెంట గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట తీసుకెళ్లేలా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు, నోటా తో కలిపి 36 అవుతున్నందున 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయన్నారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల కొరకు ఎన్నికల సంఘాన్ని కోరినట్లు, యూనిట్లు రాగానే, సమాచారం ఇస్తామని, మొదటి స్థాయి తనిఖీ తదుపరి ర్యాoడమైజేషన్ చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. మే 3 నుండి పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ చేపట్టనున్నట్లు, షెడ్యూల్ ముందస్తుగా అభ్యర్థులకు తెలపనున్నట్లు ఆయన తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల నేర చరితను దినపత్రికల్లో తప్పనిసరిగా ప్రచురించాలన్నారు. ప్రచార సంబంధ అన్ని రకాల అనుమతులకు సువిధ ద్వారా ఆన్లైన్ ద్వారా 48 గంటల ముందస్తు గా దరఖాస్తు చేయాలన్నారు. సి -విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. సమావేశంలో వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ, ఎన్నికల ఖర్చు విషయమై ఖాతా పుస్తకాలు నిర్వహించాలన్నారు. ఎన్నికలో 95 లక్షల ఖర్చు పరిమితి ఉన్నట్లు దీనికి లోబడి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఖర్చు వివరాలు సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా ఉపాధికల్పన అధికారి శ్రీరామ్, పార్లమెంట్ పోటీ అభ్యర్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.