జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మరోసారి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొద్దిరోజుల క్రితం పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్ కు జ్వరం రావడంతో.. హైదరాబాద్ లో చికిత్స తీసుకుని రెస్ట్ తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి తిరిగి అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
ఏప్రిల్ 6, ఆదివారం గాజువాకలో నిర్వహించిన వారాహి విజయభేరి ప్రచార యాత్రలో పవన్ పాల్గొన్నారు. జనసేన అభ్యర్థి కొణతాల, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రసంగం సమయంలోనే పవన్ స్వల్పంగా ఇబ్బందికి గురయ్యారు. సభ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ నీరసపడినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. దీంతో ఆయన హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. వైద్యుల సూచన మేరకు మరికొద్ది రోజుల పాటు పవన్ కల్యాణ్ రెస్ట్ తీసుకోనున్నారు.
కాగా.. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక, అలకలు, బుజ్జగింపులు పూర్తయి ఎన్నికల ప్రచారం పర్వం మొదలైంది. ఒకవైపు జగన్ బస్సుయాత్ర నిర్వహిస్తూ ప్రచారం చేస్తుండగా.. చంద్రబాబు ప్రజాగళం, పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు.
అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి – జనసేన – బీజేపీ కూటమి పోటీలోకి దిగాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురవ్వడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.