లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్ తెలిపింది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు.
‘‘తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలకు వివిధ వర్గాల ప్రజలు స్వాగతం పలికారు’’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ హింద్వి మీడియాకు తెలిపారు. యాత్ర చందౌలీలోకి ప్రవేశించిన సమయంలో ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొనవలసి ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె యాత్రలో చేరలేదు.
ఆదివారంతో యాత్ర రాజస్థాన్‌లోని ధోల్పూర్లో ముగుస్తుంది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుంండటంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 2న ధోల్పూర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ మీదుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయినిలలో కొనసాగుతుంది.