SAKSHITHA NEWS

ఒకే కూటమిలో
ఇద్దరు చంద్రులు!

మెట్రోన్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీజేపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది. టార్గెట్ 400 సీట్లలో భాగంగా పాత మిత్రులతో కొత్త పొత్తులకు సిద్ధమైంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ ఎన్డీఏలో చేరటానికి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ సైతం ఎన్డీఏలో చేరుతుందనే ప్రచారం మొదలైంది. దీని పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారా. ఏం జరుగుతోంది. ఏపీలో ఎన్నికల పొత్తులు దాదాపు ఖరారయ్యాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు అధికారికం అయింది. ఎన్డీఏలోకి తిరిగి చేరిక అంశం పైన కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో చంద్రబాబు మంతనాలు జరిపారు. పొత్తు పైన అధికారికంగా రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ప్రకటన లేదు. వచ్చే వారం ఈ పొత్తు పైన కీలక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పొత్తు ఖాయమైన తరువాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పైన నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఈ సారి ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ గా మారాయి. జగన్ ను ఓడించాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. సీట్లు దక్కని పార్టీ ఆశావాహులకు ఇప్పటికే చంద్రబాబు బుజ్జగింపులు ప్రారంభించారు. ఇక, తెలంగాణలో పొత్తులపైన ప్రచారం మొదలైంది. బీఆర్ఎస్ ఎన్డీఏలో చేరుతుందని ఈ ప్రచార.
సారాశం. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆలోచన చేసారు. కానీ, జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలు.. తెలంగాణలో ఓటమి తరువాత లెక్క మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు వచ్చింది. పొత్తు అవసరమే అభిప్రాయం పార్టీలో కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీని పైన కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. బీజేపీతో కలిస్తే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందా.. కాంగ్రెస్ కు కలిసి వస్తుందా అనే కోణంతో ప్రస్తుతం పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. బీఆర్ఎ న్ ఎన్డీఏలోకి రాదని బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా పొత్తుల పై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్..మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ పొత్తుల వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి సైతం బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఉండదని చెబుతున్నారు. అయితే, జాతీయ స్థాయిలో ఎన్డీఏ విస్తరణ.. సొంతంగా 370 స్థానాలు, కూటమిగా 400 స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తున్న వేళ రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు అయినా జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి


SAKSHITHA NEWS