లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం ఇప్పించేవరకూ “భరోసా సెంటర్” అండగా నిలుస్తుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవరణలో వున్న భరోసా సెంటర్ ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. పోక్సో చట్టం పరిధిలోకి వచ్చే కేసుల్లోని బాధిత మహిళలను అక్కున చేర్చుకుని వారికి వైద్యుడు, సైకాలజిస్టు, న్యాయాధికారి,పోలీసులు న్యాయ సహాయం చేయడం, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించడం వంటి సేవలతో బాధితులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ‘భరోసా’ కేంద్రం పని చేస్తుందని అన్నారు. బాధితులు రాగానే ఎవరి పరిధిలో వారు పనిచేస్తూ సత్వర న్యాయానికి కృషి చేస్తారని పెర్కొన్నారు.
వీటితో పాటు ఈ భరోసా సెంటర్లు బాధితులకు నైపుణ్యాలను నేర్పించి, వారిని సమాజంలో ఉన్నతంగా జీవించేలా దోహదపడుతుందన్నారు.
అందుబాటులో వున్న లీగల్, మెడికల్, చిన్నారుల కౌన్సెలింగ్ గదులు, స్టేట్మెంట్ రికార్డు సమావేశ గదులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గణేష్, సిఐ అంజలి, ఎస్సై స్రవంతిరెడ్డి, భరోసా టీమ్ పాల్గొన్నారు.