తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖపట్నంలో ట్రైనీ కలెక్టర్ గా, విజయవాడలో సబ్ కలెక్టర్ గా పని చేసిన తనకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా భాద్యతలు చేపట్టడం సంతోషంగా వుందని, తిరుపతి అభివృద్ధి విషయంలో ప్రజలను, ప్రజా ప్రతినిధులను, అధికారులను, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు.
కమిషనర్ గా భాద్యతలను స్వీకరించిన అధితి సింగ్ కు డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, నరసింహాచారి, కార్పొరేటర్లు, అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది, తిరుపతి అర్భన్ ఎమ్మార్వో, రెవెన్యూ సిబ్బంది కలిసి అభినందనలు తెలియజేసారు. అనంతరం అన్ని విభాగాల అధిపతులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ అధితి సింగ్ మాట్లాడుతూ తిరుపతికి దేశంలోనే ప్రత్యేక స్థానమున్నదని, తిరుపతిని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెల్లెందుకు అందరం కృషి చేద్దామన్నారు.