కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది..
ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
పన్ను స్లాబ్
ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు..
ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్)
ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది..
ఆర్థిక లోటు తగ్గింపు
భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50.7 బేసిస్ పాయింట్ల మేర అంటే దాదాపు రూ.9.07 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈమేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని కొందరు చెబుతున్నారు..