ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన BRS పార్టీ మేనిఫెస్టో ను చూసి ప్రతిపక్ష పార్టీలకు దిమ్మ తిరిగిపోయిందని మంత్రి, సనత్ నగర్ నియోజకవర్గ BRS పార్టీ MLA అభ్యర్ధి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో మంత్రి అద్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి BRS పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఎకరాకు సాగునీరు, 24 గంటల విద్యుత్ సరఫరా ను తెలంగాణ ప్రభుత్వం అన్నారు.
రేషన్ ద్వారా పేదలకు సన్నబియ్యం ఇస్తామని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని వివరించారు. ప్రతిపక్షంలో ఉన్ననాడు గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ సిలెండర్ కు దండం పెట్టి ఓటేసేందుకు పోయిన మోడీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 ఉన్న గ్యాస్ సిలెండర్ ధరను 1300 రూపాయలకు పెంచారని విమర్శించారు.
పేదలపై ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు 400 రూపాయలకే సిలెండర్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. చెప్పింది చేసే సత్తా ఒక్క ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మాత్రమే ఉందన్నారు. ఇక్కడి నుండి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి ఒక్క రూపాయి విలువైన అభివృద్ధి పనులు ఏమన్నా చేశారా అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్న కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం దేశం, రాష్ట్రాన్ని పాలించి ప్రజలకు ఏం చేశారో చెప్పే దైర్యం ఉందా ? అని ప్రశ్నించారు. తాము ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతామని, ఎన్నికల తదనతరం అభివృద్ధి, ప్రజా సమస్యల పైనే అధికంగా దృష్టి సారిస్తామనే అందరికీ తెలుసునని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తమ వద్దకు వచ్చే వారికి పార్టీలకు అతీతంగా అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.