2023 will be crucial in Indo-US relations: White House
భారత్-అమెరికా సంబంధాల్లో 2023 అత్యంత కీలకం: శ్వేతసౌధం
భారత్-అమెరికా సంబంధాల్లో 2022 ఓ భారీ అధ్యాయం అని శ్వేతసౌధం అధికారి అభివర్ణించారు. ప్రపంచంలో కలిసి నడిచే మంచి సంబంధాల కోసం బైడెన్ కార్యవర్గం ఎదురు చూస్తోందని పేర్కొన్నారు.
అమెరికా ప్రిన్సిపల్ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ ఫినర్ మాట్లాడుతూ బాలీలో జరిగిన జీ20 సమావేశంలో అందరూ ఏకాభిప్రాయానికి రావడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు
. ‘‘భారాన్ని పంచుకునేందుకు, ప్రపంచ అజెండాను ముందుకు తీసుకెళ్లే వారి కోసం అమెరికా భాగస్వాముల కోసం చూస్తుండగా.. మోదీ వారందరిలో అగ్రస్థానంలో నిలిచారు.’’ అని పేర్కొన్నారు. ఇరు దేశాల సంబంధాల్లో 2022, 2023 చాలా కీలకమైన సంవత్సరాలని వెల్లడించారు.
ఇరు దేశాల సంబంధాలను మోదీ, బైడెన్ ముందుకు తీసుకెళుతున్నారని అమెరికాలోని భారత దౌత్యవేత్త తరణ్ జిత్ సంధు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ నేతలిద్దరూ 15 సార్లు భేటీ అయ్యారన్నారు. ఫెస్టివల్ సీజన్ పేరిట నిర్వహించిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.