రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి కూసుమంచి మండలం గురువాయిగూడెం లో గృహజ్యోతి పథకం క్రింద చీమల సుధాకర్ రెడ్డి, చీమల వెంకట్ రెడ్డిల ఇండ్లకు వెళ్లి జీరో బిల్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభయహస్తం క్రింద 6 గ్యారంటీలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద పేదవాని వైద్యానికి రూ. 10 లక్షల ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఇప్పటికే 18 కోట్ల ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారన్నారు.
4 రోజుల క్రితం మరో 2 గ్యారంటీలు ప్రకటించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరంట్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 11న మరో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లను సీఎం భద్రాచలం రాములవారి సన్నిధిలో ప్రారంభిస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. ఆడబిడ్డలకు రూ. 2500 ల భరోసా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన అన్నారు. 82 రోజుల్లోనే 25200 ఉద్యోగాల నియామకం చేసినట్లు, మెగా డిఎస్సి చేపట్టి, 11062 ఉద్యోగాలు టీఎస్ పిఎస్సి ద్వారా భర్తీ చేయనున్నట్లు ఆయన అన్నారు. గ్రూప్ 1, 2, 3, 4 ల ద్వారా వేలాది ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ప్రజల కోరికలు వందకు వంద శాతం తీరుస్తామన్నారు. ఉద్యోగస్తులకు 5వ తారీకులోపే జీతాలు వారి ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.
అంతకుముందు మంత్రి గురువాయిగూడెం గ్రామంలో రూ. 7 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఇ సురేందర్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.