SAKSHITHA NEWS

Exgratia of Rs. 10 lakhs for the victims of the fatal train accident

ఘోర రైలు ప్రమాదం

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో

చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ

రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

ఒరిస్సా : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా బహనాగ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు భావిస్తున్నారు. మరో 350 మందికిపైగా క్షతగాత్రులై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బహనాగ్‌ రైల్వేస్టేషన్‌ వద్ద సాయంత్రం 7.15 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. క్షతగాత్రులను సోరో, గోపాల్‌పూర్, ఖంటపాడ పీహెచ్‌సీలకు తరలించారు. బాలేశ్వర్‌లో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 06782262286కు ఫోన్‌ చేయాలని అధికారులు తెలిపారు. సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, నాలుగు రాష్ట్ర సహాయక బృందాలు రంగంలోకి దించారు.

ఇదీ జరిగింది : గూడ్స్‌ రైలును ఢీ కొట్టడం వల్ల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పాయి. మరో ట్రాక్‌పై పడిన బోగీలను అటువైపుగా వస్తున్న యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దీంతో యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా లెక్కించలేదని ఒడిశా సీఎస్‌ వెల్లడించారు.

మృతులకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియో

ఒడిశా రైలు ప్రమాదంలో మృతులకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. మృతులకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ.50వేలు చొప్పున పరిహారం ప్రకటించారు.

చాలా విషాదకరం : నవీన్ పట్నాయక్​

ఈ ఘటనపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ విచారం వ్యక్తంచేశారు. ఈ ఘటన చాలా విషాదకరమన్నారు. ఉదయం ఘటనా స్థలానికి వెళ్లనున్నట్టు తెలిపారు. రెవెన్యూశాఖ మంత్రి ప్రమీలా మాలిక్‌ను ఘటనా స్థలికి వెళ్లాలని ఆదేశించారు.

చాలా బాధపడ్డా : ప్రధాని నరేంద్ర మోడీ

ఈ రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ‘ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం గురించి విని బాధపడ్డాను. ఈ దుఃఖ సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాను. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

రైలు ప్రమాదంపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదానికి గురికావడంపై బంగాల్​ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తమ రాష్ట్రం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న రైలు బాలేశ్వర్‌ వద్ద ఈ సాయంత్రం గూడ్సు రైలును ఢీకొట్టిందని తెలిపారు. తమ రాష్ట్రానికి చెందిన వారి క్షేమం కోసం ఒడిశా ప్రభుత్వం, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామని చెబుతూ.. 033-22143526/22535185 నంబర్లను ఆమె షేర్‌ చేశారు. ఘటనా స్థలానికి 5-6 సభ్యుల బృందంతో పాటు రైల్వే అధికారులను పంపిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో కలిసి తాను వ్యక్తిగతంగా అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్టు దీదీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన స్టేషన్లలో రైల్వేశాఖ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసింది.

విశాఖలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 08912746330, 08912744619
విజయనగరం: 08922-221202, 08922-221206
విజయవాడ: 0866 2576924
రాజమహేంద్రవరం: 08832420541

WhatsApp Image 2023 06 03 at 11.42.10 AM

SAKSHITHA NEWS