అమరావతి: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వై.ఎస్.భాస్కరరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భార్య వై.ఎస్.భారతికి సొంత మేనమామ. భారతి తల్లి ఈసీ సుగుణమ్మకు ఆయన సోదరుడు. మరోపక్క భాస్కర్‌రెడ్డి భార్య లక్ష్మి కూడా భారతికి మేనత్త అవుతారు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి సోదరే లక్ష్మి. వీరు కుండమార్పిడి వివాహాలు చేసుకున్నారు.
వై.ఎస్.వెంకటరెడ్డికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మమ్మ కుమారుడైన చిన్న కొండారెడ్డి తొమ్మిదో కుమారుడు వై.ఎస్.భాస్కరరెడ్డి (అవినాష్‌రెడ్డి తండ్రి). ఆరో కుమార్తె ఈసీ సుగుణమ్మ (భారతి తల్లి).
వై.ఎస్.వెంకటరెడ్డి రెండో భార్య మంగమ్మ అయిదో కుమారుడు వై.ఎస్.రాజారెడ్డి. ఆయన కుమారులు వై.ఎస్.రాజశేఖరరెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డి.
వై.ఎస్.భాస్కరరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. వరసకు చిన్నాన్న. జగన్ భార్య భారతికి అత్యంత దగ్గరి కుటుంబీకుడు.
‘‘వై.ఎస్.భారతి తల్లి ఈసీ సుగుణమ్మ.. వై.ఎస్.అవినాష్‌రెడ్డికి మేనత్త అవుతారు. అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మి.. భారతికి మేనత్త అవుతారు. అందుకే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపై ముఖ్యమంత్రి జగన్ ఆప్యాయత కనబరుస్తారు. వారంటే జగన్‌కు అభిమానం. అవినాష్‌రెడ్డి అనుచరుడైన శివశంకర్‌రెడ్డికి అందుకే జగన్‌మోహన్‌రెడ్డితో సంబంధాలున్నాయి’’ అని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివరించారు.