వైసీపీ వరుస కార్యక్రమాలు.. సీఎం జగన్ దిశా నిర్దేశం
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాల్లో విజయం లక్ష్యంగా ముందుకు సాగుతోంది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, విజయవాడలో జరిగిన వైసీపీ ప్రతినిధుల సభలో పార్టీ శ్రేణులకు చేతినిండా పని కల్పించారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్..
వరుస కార్యక్రమాలు ప్రకటించిన ఆయన.. అన్నింటిలోనూ భాగస్వామ్యం కావాలని సూచించారు. పార్టీ శ్రేణులకు వరుసగా కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించారు సీఎం జగన్.. జనవరి 1 నుంచి మరో మూడు కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్న ఆయన.. జనవరి 1 నుంచి వృధ్ధాప్య పెన్షన్ పెంపు ఉంటుంది.. మూడు వేల రూపాయలకు పెన్షన్ పెరుగుతుంది.. ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచుతున్నాం అన్నారు.. ఇక, పది రోజుల పాటు పెన్షన్ పెంపు సంబరాలు ఉంటాయన్న ఆయన.. గ్రామ స్థాయిలో జరిగే సంబరాల్లో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.
రెండో కార్యక్రమం వైఎస్సార్ చేయూత.. జనవరి 10 నుంచి జనవరి 20 వరకు జరుగుతుంది.. ఐదు వేల కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో వేస్తాం.. ఈ ఒక్క పథకం ద్వారా ఇప్పటి వరకు మహిళలకు 19 వేల కోట్లు ఇచ్చినట్లు అవుతుందన్నారు.. పది రోజుల పాటు సంబరాలు జరగాలన్నారు. మూడవ కార్యక్రమం వైఎస్సార్ ఆసరా.. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్సార్ ఆసరా అందిస్తాం.. ఇక, ఫిబ్రవరిలో మ్యానిఫెస్టోను ప్రజలకు తీసుకుని వెళ్లే కార్యక్రం ఉంటుందన్నారు.. మార్చి నెలలో ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించారు.
ఇక, ఇక్కడకు వచ్చిన అందరూ నా కుటుంబ సభ్యులు.. నా సేనానులు అంటూ వైసీపీ ప్రతినిధుల సభకు హాజరైన అందరికీ స్వాగతం పలికారు సీఎం జగన్.. ఈ సభకు రాలేకపోయిన గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు అందరికీ అభినందనలు అన్నారు.. ప్రజలకు తొలి సేవకుడిని.. అధికారం బాధ్యత ఇచ్చింది.. మూడు రాజధానులను ప్రకటించాం.. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందించాం.. మ్యానిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం.. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం తెచ్చుకొగలిగాం.. సామాజిక వర్గాలను గుండెల నిండా ప్రేమించాను… 2 లక్షల 35 వేల కోట్ల రూపాయలను డీబీటీ ద్వారా అందించాం అని చెప్పుకొచ్చారు.
2019లో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి .. ఈ నాలుగేళ్ళల్లో నే అదనంగా 2 లక్షల 27 వేల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు సీఎం జగన్.. 52 నెలల్లో వ్యవస్థల్లో, పాలనలో తీసుకుని వచ్చిన పార్టీ దేశ చరిత్రలోనే లేదన్న ఆయన.. ఎన్నికలు మార్చి, ఏప్రిల్ లో జరుగుతాయన్నారు. మన ఆలోచనలను గ్రామ స్థాయిలోకి తీసుకుని వెళ్లాలి.. గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అందరికీ అర్థం అయ్యేటట్లు చెప్పాలి.. జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ జరుగుతోంది.. సెప్టెంబర్ 30న ప్రారంభించాం.. నవంబర్ 10 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.. రాష్ట్రంలో ఎవరూ వ్యాధుల బారిన పడకుండా ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు.. ఎవరైనా వ్యాధుల బారినపడిన ప్రభుత్వం చేయి పట్టుకుని రోగాల బారి నుంచి బయటకు తీసుకుని రావాలి.. 15,004 సచివాలయాల పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపైన్ జరుగుతోంది.. కోటి 60 లక్షల ఇళ్ళను కవర్ చేస్తున్నాం.. ఎవరికి ఆరోగ్య సమస్యలు రాకుండా జల్లెడ పడుతున్నాం.. 5 దశల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అన్నారు.
ఇక, ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం.. నవంబర్ ఒకటి నుంచి డిసెంబర్ 10 వరకు 40 రోజుల పాటు నిర్వహిస్తాం.. 3వ కార్యక్రమం బస్సు యాత్రలు.. అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు దాదాపు 60 రోజుల పాటు.. మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలు ఉంటాయని తెలిపారు సీఎం జగన్.. ఒక్కో టీం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులు ఉంటారు.. ఎమ్మెల్యేల నేతృత్వంలో సమావేశాలు జరగాలన్నారు.. ప్రతి రోజూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు.. ఒక్కో నియోజకవర్గంలో పర్యటించిన సామాజిక న్యాయం, చేసిన అభివృద్ధి, తీసుకుని వచ్చిన మార్పులను వివరిస్తారని తెలిపారు. బస్సు పై నుంచే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగాలు.. అందరూ బస్సు యాత్రలో పాల్గొనాలని తెలిపారు.. ఇది మామూలు బస్సు యాత్ర కాదు సామాజిక న్యాయ యాత్రగా అభివర్ణించారు.. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం.. పేదవాడి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు జరుగుతాయి అన్నారు సీఎం జగన్.. రేపు జరిగేది కులాలు, మతాల మధ్య యుద్ధం కాదు.. పేద వాళ్ళంతా ఏకం కావాలి.. అప్పుడే పెత్తందార్లకు బుద్ధి చెప్పగలుగుతాం .. జెండా మోసేది, సభల్లో పాల్గొనేది పేదవాడే అన్నారు.
నాల్గవ కార్యక్రమం ఆడుదాం ఆంధ్రా.. డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఉంటుంది.. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఇది.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ముగియగానే ఆడుదాం ఆంధ్రా చేపట్టాలన్నారు సీఎం జగన్.. భారత క్రీడా టీంలో వై నాట్ ఆంధ్రప్రదేశ్ అనే విధంగా క్రీడా ప్రాతినిధ్యం ఉండాలి.. గ్రామ నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరగాలి.. మరుగున పడిన పిల్లల టాలెంట్ ను దేశానికి పరిచయం చేసే కార్యక్రమం ఇది అన్నారు సీఎం వైఎస్ జగన్.