తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణస్వీకారం చేయబోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘నో కామెంట్’ అంటూ వెళ్లిపోయారు. సీఎం ఎంపిక విషయంపై అధిష్టానంతో చర్చించేందుకు భట్టి విక్రమార్కతో కలిసి ఉత్తమ్ ఢిల్లీ చేరుకున్నారు. పలువురు సీనియర్ లీడర్లను కలిసినట్లు సమాచారం. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్ తో ఉత్తమ్ మధ్యాహ్నం భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై దాదాపు గంటన్నర పాటు ఇద్దరూ చర్చించారు. మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దీంతో ఉత్తమ్ క్లుప్తంగా మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను హైకమాండ్ కు వివరించినట్లు చెప్పారు. సీఎం ఎంపిక బాధ్యత హైకమాండ్ దేనని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సీఎంగా ఎవరి పేరును ఖరారుచేశారని మీడియా అడగగా.. నో కామెంట్ అంటూ ఉత్తమ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ తర్వాత డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసానికి బయలుదేరారు. ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ లకు తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయాలను వివరించనున్నట్లు సమాచారం.